Seethakka: దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ…ఆనాడు అనుమతులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పనంగా అప్పచెప్పిందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే తమను అపహాస్యం చేశారని విమర్శించారు. కనీస గ్రామ సభలు నిర్వహించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని మండిపడ్డారు. సంపూర్ణమైన అనుమతులు ఇచ్చినట్టు కేసీఆర్, కేటీఆర్ సంతకాలు కూడా ఉన్నాయని చెప్పారు.
Also read: నేటి నుంచి మహబూబ్ నగర్‌లో ‘రైతు పండగ’.. అన్నదాతలకు ఒకే రోజు రెండు శుభవార్తలు
రాజకీయ దురుద్దేశంతోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్మిషన్ ఎవరిచ్చారా చర్చకు రావాలని కోతున్నట్టు చెప్పారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడు తలసాని సాయి కిరణ్ సహా మరో 10 మంది డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు. కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు కూడా డైరెక్టర్ గా ఉన్నారని తెలిపారు. ఆనాడు బీజేపీ గ్రామ సభలు అవసరం లేదని సపోర్ట్ చేసిందని అన్నారు. రెచ్చగొట్టే వైఖరిని బీఆర్ఎస్ అవలంబిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతో కేసీఆర్, కేటీఆర్ పర్మిషన్ ఇప్పించారని త్వరలోనే అన్ని వివరాలు బయటపడతాయని సీతక్క స్పష్టం చేశారు.
ప్రజలు కూడా వాస్తవాలను తెలుసుకోవలని అన్నారు. ప్రజల నుండి వందలు, వేల ఎకరాలను గుంజుకుని ఇష్టం వచ్చిన కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరని హెచ్చరించారు. ఆధారాలతో సహా ఎవరెవరు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారో స్పీకర్ ముందు అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పారు. ప్రజలను ఎవరు రెచ్చగొట్టారో కూడా బయట పెడతామని అన్నారు. దమ్ముంటే కేటీఆర్ దిలావర్పూర్ వచ్చి రైతులతో మాట్లాడాలని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలో ఎంతో మంది చనిపోయారని ఒక్కరూ కూడా వారి కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు.
తమ ప్రభుత్వంలో నలుగురు మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారని అన్నారు. అమ్మాయిని బతికించేందుకు రూ.15 ఖర్చు చేశామని కాస్త కోలుకున్న తరవాత కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందని చెప్పారు. ఎమ్మెల్సీ దండే విఠల్ అక్కడే ఉండి విద్యార్థిని ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నారని అన్నారు. బాధిత కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని వ్యాఖ్యానించారు. త్వరలోనే హాస్టళ్లలో బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలను కూడా బయట పెడతామని అన్నారు.
ఆధారాలతో సహా అన్నీ బయటపెడతామని, హాస్టళ్లలో జరుగుతున్న ఘటనలపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. లగచర్లలో గ్రామ సభలో బీఆర్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామసభలు పెట్టకుండా లారీలలో ప్రజలను తరలించారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో పట్టుమని లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన ప్రతిపని గురించి ప్రజలతో చర్చించిందని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే గ్రామసభలకు సహకరించాలని కోరారు.