Mahabubnagar: నేటి నుండి మహబూబ్ నగర్ లో రైతు పండగ జరగబోతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు చేపడుతోంది. మొత్తం ఐదు రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ లో నేటి నుండి రైతు పండగ నిర్వహిస్తున్నారు. ఓ సభలా కాకుండా ఉత్సవంలా నిర్వహిచాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఈ ఉత్సవాల్లో రైతులకు వ్యవసాయం గురించి కొత్త విషయాలు భోదించనున్నారు. ఆధునిక పద్దుతుల్లో వ్యవసాయం చేయడం, లాభసాటి వ్యవసాయం లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఉత్సవాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులను ఆహ్వానించాలని సైతం ముఖ్యమంత్రి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సభకు లక్షల్లో రైతులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30 మహబూబ్ నగర్ కు రానున్నారు.
Also read: హైదరాబాద్ లో మరో చెరువును కాపాడిన హైడ్రా.. నిఘా పెట్టిమరీ
రైతుపండగలో పాల్గొని రాష్ట్రంలో వ్యవసాయం గురించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు రుణమాఫీ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2లక్షల రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఆధార్ లో పేర్లు తప్పుగా పడటం, ఇతర కారణాల వల్ల మరో నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ రైతులకు ఇదే సభలో సీఎం 4 లక్షల మంది రైతులకు సంబంధించిన మాఫీని సైతం పూర్తి చేస్తారని సమాచారం.
అంతే కాకుండా సన్నరకం ధాన్యానికి ఇస్తామని చెప్పిన రూ.500 బోనస్ కూడా అదే రోజు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటూ వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, ప్రీమియం సొమ్ము చెల్లిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతు పండగలో ప్రస్తావించే అవకాశం ఉంది.