– గాంధీ ఆస్పత్రి దగ్గర టెన్షన్ వాతావరణం
– మంత్రి సీతక్కను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
– ఆదివాసీ మహిళ ఘటనపై నిలదీత
– మతం రంగు పులమొద్దని మంత్రి ఫైర్
– నిందితుడిని శిక్ష పడుతుందని హామీ
Jianur: ఆదివాసీ మహిళపై హత్యాయత్నం ఘటన రాజకీయంగా సెగలు పుట్టిస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స అందిస్తుండగా, పోటాపోటీగా నేతలు పలకరిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మంత్రి సీతక్క పరామర్శించేందుకు వెళ్లగా, బీజేపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనుమానాలొద్దు.. కఠినంగా శిక్షిస్తాం!
ఆదివాసీ మహిళను పరామర్శించిన సీతక్క, శస్త్ర చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ సంక్షేమ శాఖ తరఫున లక్ష రూపాయల పరిహారాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన విషయంలో కొందరు చేస్తున్న విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. దాడి ఘటనను పక్కదారి పట్టించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. తక్షణ పరిహారంగా లక్ష రూపాయలు ఇస్తే దాన్ని కూడా తప్పు పడతారా? అని మండిపడ్డారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని తెలియగానే ప్రభుత్వం వెంటనే స్పందించిందని, నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చేయడం తమ బాధ్యతగా చెప్పారు. మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా, ఆడబిడ్డగా, ఆదివాసీ బిడ్డగా తనకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉందన్నారు. ఘటనకు మతం రంగు పులిమేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, మత కొట్లాటలు రేపేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. వారి పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దోషులను పక్కనపెట్టి ఆదివాసీలపై కేసులా?
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ మాట్లాడారు. జైనూరులో ఆదివాసీ మహిళపై అమానవీయ ఘటన జరిగిందని, నిందితుడు అత్యాచారం చేసి హత్య చేయబోయాడని కుటుంబసభ్యులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని, అత్యాచారానికి యత్నించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలపైన వరుసగా దాడులు జరుగుతున్నా, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, దోషులను పక్కనపెట్టి ఆదివాసీల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దోషులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. అత్యాచారం జరగలేదన్న సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి మాట్లాడుతూ, మహిళపై జరిగిన అత్యాచారాన్ని మత ఘర్షణగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. బాధిత మహిళను ఆదుకునేందుకు చెక్కు తీసుకువచ్చిన సీతక్క, నిందితుడికి ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Mallu Bhatti Vikramarka: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఇక వాటికి ఉచిత విద్యుత్
మతం రంగు పులుమొద్దు!
జైనూర్ మండలంలో మహిళను ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపర్చి, హత్యాయత్నానికి పూనుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్రంగా ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి సరైన వైద్యంతో పాటు, కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణతో జైనూర్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని, ఈ సందర్భంగా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ పార్టీలు ఘటనకు మతం రంగు పులమొద్దని, వైషమ్యాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టొద్దన్నారు వీరభద్రం.