E-Paper
Advertisement

Minister Seethakka: ఉపాధ్యాయుల చేతిలోనే దేశ భవిష్యత్తు: మంత్రి సీతక్క

Minister Seethakka: ఉపాధ్యాయుల చేతిలోనే దేశ భవిష్యత్తు: మంత్రి సీతక్క
Advertisement

Minister Seethakka: ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఉపాధ్యాయులందరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు. సమాజాన్ని మార్చే శక్తి విద్యకే ఉందని, ఆ విద్యను ప్రజలకు అందించే బాధ్యత టీచర్ల చేతుల్లోనే ఉందని ఆమె పేర్కొన్నారు.

మనమంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని ఎదిగిన వారమేనని మంత్రి సీతక్క గుర్తు చేశారు. తాను ములుగు గర్ల్స్ హాస్టల్‌లో ఉండి చదువుకున్నానని, ప్రభుత్వ విద్యే తన జీవితానికి దిశానిర్దేశం చేసిందని చెప్పారు. ఉద్యమ కాలంలో సమాజ జ్ఞానాన్ని, శ్రమను గౌరవించడం, ప్రజల కోసం జీవించాలనే సిద్ధాంతాన్ని ఎర్రజెండా నుంచే నేర్చుకున్నానని ఆమె అన్నారు. ఆ విలువలే తనను ఈ స్థాయికి తీసుకొచ్చాయని స్పష్టం చేశారు.

Advertisement

ఈ విలువలను మన జీవితాల్లో పాటిస్తూ లక్షలాది మంది విద్యార్థులను.. తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వ విద్య బలోపేతం కోసం యుటిఎఫ్ (UTF) సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని, అందుకు ఉపాధ్యాయులే ముందుండాలని పిలుపునిచ్చారు.

టీచర్ల చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులకు సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేరళ తరహాలో అక్షరాస్యతలో తెలంగాణను ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం, ఉపాధ్యాయులు కలిసి కృషి చేయాలని సూచించారు. అందరి జీవితాలను తీర్చిదిద్దే పవిత్ర వ్యవస్థ విద్యా వ్యవస్థ అని, ఆ వ్యవస్థలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు.

Advertisement

సమాజంలో ఉన్న అసమానతలను ఛేదిస్తూ మనం కొంతైనా చదువుకున్నామని, మనం నేర్చుకున్నది పది మందికి పంచాలన్నదే మన సిద్ధాంతంగా మారాలని సీతక్క పేర్కొన్నారు. విద్యతోనే నిజమైన విముక్తి సాధ్యమవుతుందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల వల్లే తనలాంటి వారు చదువుకుని.. మంత్రి స్థాయికి చేరగలిగారని ఆమె భావోద్వేగంగా తెలిపారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకున్న తాను మంత్రి అయినా కూడా తన పరిశోధన, పరిశీలనను ఆపలేదని, తన విద్యార్హతలే ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెప్పారు. 70 ఏళ్లలో తన కోయ జాతికి మంత్రి పదవి రాకపోయినా, ఈ రోజు ఆ అవకాశం దక్కడం తన అదృష్టమని అన్నారు. తన చదువు, చిత్తశుద్ధి, నేర్చుకున్న విలువలు, ప్రజాసేవే తనను ముందుకు నడిపించాయని స్పష్టం చేశారు.

వామపక్ష, ప్రగతిశీల సంఘాల్లో పనిచేసే వ్యక్తులు సమాజ విలువలను ఎక్కువగా గౌరవిస్తారని, శ్రమకు ప్రాధాన్యం ఇస్తారని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయులు తమ హక్కుల కోసం పోరాడుతూనే, ప్రతి ఒక్కరికీ చదువు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ విద్య బలోపేతం కావాలని పోరాడుతున్నారని ప్రశంసించారు. వారి పోరాటాలు న్యాయమైనవని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధ్యాయ భర్తీలు చేపట్టి పని భారం తగ్గించారని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు పూర్తి చేశారని చెప్పారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిలు ఉన్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కారుణ్య నియామకాలు, పాఠశాల సమయ సవరణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి సమస్యలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి సీతక్క విమర్శలు చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, గత పది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారని ఆరోపించారు. ఉపాధిని హక్కుగా కాకుండా భిక్షలా కేంద్రం చూస్తోందని, అందుకే ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చిందని విమర్శించారు.

Also Read: రేవంత్ రెడ్డికి పౌరుషం ఉంటే.. కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపాలి: ఎంపీ అరవింద్

ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత.. టీచర్లపైనే ఉందని మంత్రి పిలుపునిచ్చారు. టీచర్లే సమాజ మార్గదర్శకులని, సామాన్యుల పక్షాన పోరాడాల్సిన బాధ్యత కూడా వారి మీదే ఉందని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు.

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×