Sridhar Babu: తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏఐ మెషిన్ లెర్నింగ్ క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలలో తెలంగాణ యువతను అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా మార్చడానికి సమగ్ర రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని మంత్రి తెలిపారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐసీ)లో జరిగిన స్కిల్ కాన్వకేషన్ ఇన్ ఐటీ/ఐటీఈఎస్ సెక్టార్ & ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్ హ్యాకాథాన్ 2025ను శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
టెక్నాలజీ వేగంగా మారుతోందని ఆ మార్పులను అందిపుచ్చుకోగలిగితేనే భవిష్యత్తు ఉంటుందని మంత్రి యువతకు సూచించారు. కేవలం రెండేళ్లలోనే 40 శాతానికి పైగా అంతర్జాతీయ కంపెనీలు జనరేటివ్ ఏఐను తమ కోర్ వర్క్‌లో భాగం చేసుకున్నాయని గుర్తు చేశారు. ఏ వల్ల ఉద్యోగాలు పోతాయన్నది కేవలం అపోహ మాత్రమేనని అది ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తుందని తేల్చి చెప్పారు. ఆటోమేషన్ కారణంగా 85 మిలియన్ జాబ్స్ పోయినా కొత్తగా 97 మిలియన్ల స్కిల్ ఆధారిత ఉద్యోగాలు వస్తాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) నివేదికను ఆయన ఉటంకించారు.
ప్రతి సంక్షోభంతో పాటే కొత్త అవకాశాలు కూడా వస్తాయని యువత అందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడుతోందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా క్లీన్ టెక్ ఈవీలు గ్రీన్ ఇన్నోవేషన్ రంగాలలో అవకాశాలు పెరుగుతున్నాయన్నారు.
ఈ డిజిటల్ యుగంలో కేవలం అకడమిక్ డిగ్రీలతో మాత్రమే ఉద్యోగాలు రావని ఇన్నోవేషన్ ప్రాబ్లం సాల్వింగ్ ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటేనే విజయం సాధ్యమన్నారు. తమ ప్రభుత్వం భవిష్యత్తును ఊహించడం కాకుండా దానికి అవసరమైన స్కిల్లింగ్ ఎకో సిస్టంను నిర్మిస్తోందని వివరించారు. మార్కెట్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టూ వర్క్ ఫోర్స్ ను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం భుజానకెత్తుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐసీ డైరెక్టర్ డా. రామేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Telangana Vision 2047: వచ్చే నెలలో గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల వేటకు రెడీ అయిన రేవంత్ సర్కార్