Thummala Nageswara Rao: రాబోయే ఖరీఫ్–2026 సీజన్ దృష్ట్యా రాష్ట్రంలో ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలలకు ప్రతి నెల 2 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున యూరియాను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు గురువారం లేఖ రాశారు. రాష్ట్ర అవసరాలను వివరించారు. గత రబీ సీజన్‌లో రాష్ట్రానికి సమయానికి యూరియా కేటాయించినందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేశామన్నారు.
ఆ కేటాయింపుల వల్ల గత ఖరీఫ్ లో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా వ్యవసాయ పనులు సజావుగా సాగాయని తెలిపారు. రబీ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఖరీఫ్–2026 సీజన్ ప్రారంభానికి యూరియా ప్రారంభ నిల్వలు 50 వేల మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే ఉండవచ్చని మంత్రి తెలిపారు. 2024 ఖరీఫ్ సీజన్ లో రాష్ట్రానికి గణనీయమైన ప్రారంభ నిల్వలు ఉండటం వల్ల ఎరువుల సరఫరా సాఫీగా జరిగిందని గుర్తు చేశారు. ఖరీఫ్–2024 లో 4.65 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, ఖరీఫ్–2025లో 1.99 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వలు ఉండటం వల్ల ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభ నిల్వలు 50 వేలకు మించి ఉండకపోవచ్చని వెల్లడించారు.
2024 ఖరీఫ్ సీజన్లో ఉన్న నిల్వలు రాష్ట్రానికి బఫర్ స్టాక్ ఏర్పాటుకు దోహదపడి రైతులకు ఎరువులు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చేశాయని తెలిపారు. అయితే రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ఈ విధంగా ప్రారంభ నిల్వలు ఉంచుకోవడం ఇప్పుడు ప్రాధాన్యతగా మారిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 70 శాతం పంటలు ఖరీఫ్ సీజన్‌లోనే సాగు అవుతాయని తెలిపారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు ఈ సీజన్‌లో విస్తృతంగా సాగు చేస్తారని, ఈ పంటలకు అధిక మొత్తంలో యూరియా అవసరం ఉంటుందన్నారు. సాధారణంగా రాష్ట్రంలో జూలై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కొంత ముందుగానే ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులకు సమయానికి ఎరువులు అందుబాటులో ఉండేందుకు ముందుగానే నిల్వలు ఏర్పాటు చేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. వినియోగం తక్కువగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో బఫర్ స్టాక్ ఏర్పాటు చేయడం ద్వారా తరువాతి నెలల్లో పెరిగే డిమాండ్‌ను సులభంగా తట్టుకోవచ్చని పేర్కొన్నారు.
ఖరీఫ్ సీజన్‌లో యూరియా డిమాండ్ ఎక్కువగా ఉండే జూలై , ఆగస్టు నెలల్లో కనీసం నెలకు 3లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని తెలిపారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే తగిన నిల్వలు సిద్ధం చేయడం ద్వారా రైతులకు ఎరువుల కొరత లేకుండా సరఫరా చేయవచ్చని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బఫర్ నిల్వలు ఏర్పాటుకు అనుకూలంగా సరఫరా ప్రణాళిక కింద ఏప్రిల్, మే, జూన్ నెలలకు ప్రతి నెల 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కేటాయింపులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తగిన నిల్వలు ఏర్పరచుకుని ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా యూరియా అందుబాటులో ఉంచగలదని మంత్రి తెలిపారు.