Miss World Event : అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక మరో మెగా ఈవెంట్ కు తెలంగాణ వేదిక కాబోతుంది. ప్రపంచం దేశాల్లోని సుందరీమణులంతా విశ్వ సుందరీ కిరీటం కోసం పోటీపడే.. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ కేంద్రం కానుంది. ఏటా ఒక్కో దేశంలో నిర్వహించే ఈ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాంతో.. ప్రస్తుతం నిర్వహిస్తున్న 72వ ఎడిషన్ పోటీలను తెలంగాణాలో నిర్వహించేందుకు పోటీల నిర్వహణ సంస్థ ఆసక్తి చూపగా, తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖలు ప్రోత్సాహం అందించాయి. దాంతో.. ఈ పోటీలను మే 7 నుంచి 31 వరకు వివిధ దశల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాల్ని మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్ పర్సన్ జూలియా మోర్లే… టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ అధికారికంగా వెల్లడించారు.
హైదరాబాద్‌లోనే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే సహా ప్రారంభ, ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్వహణ సంస్థ భావిస్తుండగా, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని స్మితా సబర్వాల్ ప్రకటించారు. ఓపెనింగ్, గ్రాండ్ ఫినాలే ఈవెంట్లతో సహా అనేక దశల్లో పోటీలు నిర్వహించనున్నారు. వీటిలో రాష్ట్రంలోని మిగతా ప్రముఖ నగరాల్లో నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా.. ఈ పోటీల్లో పాల్గొనేందుకు అంతర్జాతీయంగా 120 దేశాల నుంచి సుందరీమణులు రానున్నారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్ట్జా ఫీజ్‌కోవా కిరీటాన్ని ధరింపజేయనున్నారు. ఎందుకంటే.. గతేడాది విశ్వసుందరీ కిరీటాన్ని ఆమె గెలుచుకున్నారు.
భారత్ లోని యంగ్ స్టేట్ అయిన తెలంగాణ, ఆవిర్భవించిన మొదటి దశాబ్దంలోనే వేగవంతమైన పురోగతి సాధించిందంటూ ప్రసంశలు కురిపించిన మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వెబ్‌సైట్.. హైదరాబాద్ అద్భుత నగరం అని తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యపరిచేలా మౌలిక సదుపాయాలు, అద్భుతమైన కనెక్టివిటీ ఉందని తన వెబ్ సైట్లో రాసుకొచ్చింది. ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలలో ఒకటైన్ ఇందిరా గాంధీ అంతర్జాతీయం విమానాశ్రయం, ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, అభివృద్ధి చెందుతున్న ఐటీ-ఆధారిత సేవల రంగం, భారీ ఆరోగ్య మౌలిక సదుపాయాలతో కూడిన ప్రపంచ ఔషధ కేంద్రాలు హైదరాబాద్ లో కొలువుదీరాయంటూ తెలిపింది. ఇక్కడి సినిమా పరిశ్రమ ఎప్పుడూ సందడిగా ఉంటుందని.. ఇక్కడ భద్రత పర్యాటక అనుకూలతకు కారణంగా అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఇదో గమ్యస్థానంగా మారుతుందంటూ తన వెబ్ సైట్లో పోటీలు నిర్వహించే నగరం గురించి రాసుకొచ్చింది.
Also Read : UP Cops – Maha Kumbh Mela : కుంభమేళలో యువతుల స్నానాలు – అమ్మకానికి వీడియోలు
కాగా.. అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక పోటీలైన విశ్వసుందరీ పోటీలు ఇప్పటి వరకు ఇండియాలో ఒకసారి మాత్రమే జరిగాయి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం 1996లో బెంగళూరులో ఈ పోటీలను నిర్వహించగా, మళ్లీ ఇన్నాళ్లకు ఆ అవకాశం హైదరాబాద్ కు దక్కింది. ఈ సారి ఇండియా తరఫున ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 విజేత నందిని గుప్తా ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలో ప్రాతినిధ్యం వహించనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 120కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి పాల్టిసిపెంట్స్ రానుండగా… వారందరూ హైదరాబాద్ వేదికగా ఒకచోటకు చేరనున్నారు. ఈ పోటీలు ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం మాత్రమే కాకుండా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నినాదమైన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే లక్ష్యాన్ని సాధించేందుకు పోటీ జరుగుతుందంటూ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల ప్రతినిధులు మే 7న తెలంగాణకు చేరుకుంటారు. అక్కడి నుంచి కార్యక్రమాలు మొదలవనున్నాయి.