MLA Kadiyam Srihari: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉందన్నారు. న్యాయస్థానం తీర్పు ఎలా వచ్చినా శిరసావహిస్తానని మనసులోని మాట బయపెట్టారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉంటానని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పారిపోయే పరిస్థితి అస్సలు లేదని కుండబద్దలు కొట్టేశారు.
వరంగల్‌లో ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి, బీఆర్ఎస్ నుండి వెళ్లిన వారిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేయడంపై మండిపడ్డారు. తమను అనేముందు ఒక్కసారి బీఆర్‌ఎస్ వెనక్కి తిరిగి చూసుకోవాలన్నారు. పదేళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని మంత్రులు చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు.
ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయ పార్టీలను అసెంబ్లీలో లేకుండా చేసింది ఎవరని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ సుద్ద పూసలన్నట్లుగా ఈ రోజు మాట్లాడుతున్నారా? మీరు చేస్తే సంసారం.. ఇతరులది వ్యభిచారమా అంటూ కాస్త రుసరుసలాడారు. అసలు ఫిరాయింపుల మీద మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు.
ఢిల్లీ ఫలితాలు బీజేపీ ఊహించినట్లుగా వచ్చాయని తెలిపారు. బీజేపీ గెలిస్తే కేటీఆర్ ఎందుకు సంతోషం పడుతున్నారో అర్థం కాలేదన్నారు. ఢిల్లీలో ఆప్ ఓటమికి బీఆర్ఎస్ కారణమన్నారు. మొదటిసారి ప్రభుత్వంలో బాగానే పని చేశారని, రెండోసారి అధికారం రాగానే బీఆర్‌ఎస్ దోస్త్ దెబ్బకొట్టిందన్నారు.
ALSO READ: కేరళలో సీఎం రేవంత్‌రెడ్డి
లిక్కర్ స్కామ్‌లో సీఎం సహా ముగ్గురు జైలుకు వెళ్లారని, అందువల్లే ఆప్ ఓడిపోయింద న్నారు. ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితాలు మరోలా ఉండేవన్నారు. ఘనపూర్ నియోజకవర్గం అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ సహకారం కోసం పార్టీ మారానని తెలిపారు.
నా నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించి ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఘనపూర్ నుంచి గెలిపించారన్నారు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడేవాళ్లకు ప్రజలు ఏనాడో సమాధానం చెప్పారని మనసులోని మాట బయటపెట్టారు. సిగ్గులేకుండా మాట్లాడేవాళ్ళకు ఏం చెప్పినా అర్థం కాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గిట్టనివారు ఘనపూర్‌లో అభివృద్ధి ఏం జరగలేదని మాట్లాడు తున్నారని అన్నారు. చేతగానివారు, చేవలేని అవినీతి పరులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఘనపూర్ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చాయన్నారు.
రేపో మాపో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరగనున్నట్లు తెలిపారు. నా ఎజెండా అభివృద్ధి అని, ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనన్నారు. తన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని తెలియజేశారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి, పదేళ్లు ప్రభుత్వం ఉన్నప్పటికీ చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోయారంటూ వ్యాఖ్యానించారు.