Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పాత పద్దతి కంటిన్యూ అవుతుందా? సొంత పార్టీ నేతలే పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బకు కారణాలేంటి? కొత్త ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో పరిస్థితి మారుతుందా? లేక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తారా? ఇవే ప్రశ్నలు చాలామంది నేతలను వెంటాడుతున్నాయి.
ఎమ్మెల్సీ ఫలితాలు
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లకు గాను రెండింటిని బీజేపీకి గెలుచుకుంది. సత్తా చాటుతుందని భావించి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రభావం చూపలేకపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. అయినా నిరుద్యోగులు అధికార పార్టీ వైపు మొగ్గుచూపలేదు. టీచర్లలో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. వీరిని ఆకట్టుకోలేక పోయింది.
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు గురించి చెప్పనక్కర్లేదు. అందరు ఒక్కటిగా కనిపిస్తున్నప్పటికీ ఎవరికి వారే పైచేయి సాధించాలని ఆరాట పడతారు. ఆ కారణంగానే ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు ఇన్‌ఛార్జ్‌లు మారారు. కానీ పార్టీలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతుంటే కాంగ్రెస్ నేతలు వారిలో వారే కత్తులు దూసుకుంటున్నారు.
మీనాక్షి రాకతో
తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను గమనించింది అధిష్టానం. కొత్త ఇన్‌ఛార్జ్ మీనాక్షిని రంగంలోకి దింపింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు కేవలం 10 రోజులు ముందుగా మాత్రమే ఆమె నియమితులయ్యారు. నేతలు బిజీగా ఉండడంతో ఆమె అటువైపు దృష్టి పెట్టలేదు. ఎన్నికల తర్వాత ఆమె తన ట్రీట్‌మెంట్ మొదలు పెట్టారు. పైరవీలు ఏ మాత్రం పని చేయవని నేతలకు సంకేతాలు ఇచ్చారామె. పార్టీ లైన్ దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని సున్నితంగా హెచ్చరించారు.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తప్పుకుంటా
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు ప్రధానమైన గ్యారంటీలు అమలు చేసింది. మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది.. సక్సెస్ అయ్యింది. ఆరోగ్య శ్రీలో దాదాపు అన్ని రోగాలు కవర్ అయ్యేలా చర్యలు చేపట్టింది. రైతులకు రుణమాఫీ అమలు చేసింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మిగతా పథకాలు అమలు పరిచేందుకు ప్రయత్నాలు క్రమంగా చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తన ఒకొక్కటిగా చేసుకుంటూ పోతోంది.
విపక్షాల ఎత్తులు, అంచనా వేయని కాంగ్రెస్
విపక్షాల ఎత్తులను అధికార పార్టీ గమనించలేదన్నది కొందరి మాట. సరిగ్గా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నీళ్లు వ్యవహారాన్ని ఎత్తుకుంది. దీని ద్వారా కీలక అంశాల నుంచి అధికార పార్టీని పక్కదారి పట్టిందని కొందరు అంటున్నారు.
అప్పుడు ఏపీలో ఇదే జరిగింది?
ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. వైసీపీ హయాంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. అప్పటి వైసీపీ పెద్దలు మా ఓటు బ్యాంకు సెపరేట్‌గా ఉందనే భ్రమలో పడ్డారు. అదే విషయాన్ని బయటకు చెప్పారు. టీడీపీ అన్నింటిలోనూ టీడీపీ విజయం సాధించింది. ఉద్యోగులు, చదువుకున్న వారిని తమవైపు తిప్పుకుంది, ఆపై సక్సెస్ అయ్యింది. అప్పటికి అసెంబ్లీ ఎన్నికల దగ్గరలో ఉండడంతో వైసీపీ కోలుకోలేకపోయింది.
ఇక తెలంగాణ విషయానికి వద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లు సమయం ఉంది. ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఈలోగా నేతలు గ్రౌండ్ స్థాయిలోకి వెళ్తే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు బ్రహ్మండమైన ఫలితాలు రావడం ఖాయం. ఎంతకీ రాజధానిలో కూర్చుని విపక్షాలపై విమర్శలు గుప్పించినంత మాత్రమే ఎలాంటి ఫలితం ఉండదని కొంత రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.