బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతకాలం తండ్రి ఆదరణ కోసం ఎదురు చూశారు కవిత. కానీ కేటీఆర్ ని కాదని కేసీఆర్, కవితను దగ్గరకు తీయరనే విషయం తేలిపోయింది. బీఆర్ఎస్ లో కేటీఆర్ మినహా ఇంకెవరి నాయకత్వాన్నీ కేసీఆర్ ప్రోత్సహించరనే విషయం రూఢీ అయిపోయింది. దీంతో కవిత వేరు కుంపటి పెట్టారు. ఆల్రడీ ఉన్న జాగృతిని కొత్తగా తెరపైకి తెస్తున్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ జాగృతిని కూడా కవిత, భారత జాగృతిగా మార్చేశారు. పార్టీలో వివాదాల అనంతరం ఆమె తిరిగి తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యకలాపాలు కొనసాగించడం గమనార్హం. తాజాగా కొత్త నాయకత్వం కోసం అంటూ ఓ కార్యక్రమం చేపట్టారు కవిత. ఈ మీటింగ్ లో కనీసం కేసీఆర్ పేరు కూడా ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం.
కేసీఆర్ ఊసే లేదు..
తెలంగాణ బాబు, తెలంగాణ జాతిపిత అంటూ కేసీఆర్ కి హైప్ ఇస్తుంటారు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయంలో కవిత మరో అడుగు ముందు ఉంటారు. అలాంటి కవిత, తన కార్యక్రమంలో కనీసం కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడం సంచలనంగా మారింది. జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు కవిత. తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని.. కొత్తగా, నవీనంగా ఉంటేనే సంస్థలు బతుకుతాయని వివరించారు. ఇతరుల గోప్యతను, మర్యాదను కాపాడకుండా ఏది పడితే అది మాట్లాడడం ఇప్పుడు ట్రెండ్ గా మారిందని అన్నారామె. తెలంగాణ జాగృతి నాయకులు మాత్రం ఇతరులను తిట్టకుండా పదునైన విమర్శ చేయడం నేర్చుకోవాలని సూచించారు. తిట్లకు దిగజారారంటే వారిలో విషయం లేదని అర్థమని, పక్కోడిని తిడుతున్నారంటే కంటెంట్ లేనట్లు అర్థమని పేర్కొన్నారు కవిత.
తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ… pic.twitter.com/nwFTAEuqzt
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) July 26, 2025
బ్యానర్లో తూతూమంత్రంగా..
లీడర్ కార్యక్రమ బ్యానర్లో మాత్రం కేసీఆర్ ఫొటో నామ మాత్రంగానే పెట్టారు. సభలో కనీసం కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదు కవిత. జాతిపిత గాంధీని పొగిడారు కానీ, తెలంగాణ పిత అని తన తండ్రి పేరు చెప్పుకోలేదు. చూస్తుంటే కేసీఆర్ ఫొటో కూడా లేకుండానే నెక్స్ట్ జాగృతి బ్యానర్లు రెడీ అవుతాయని అనిపిస్తోంది. బీఆర్ఎస్ లో తనకు ప్రాధాన్యం దక్కడంలేదని గుర్రుగా ఉన్న కవిత, కేసీఆరే తనకు బాస్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అసలు కేసీఆర్ కూడా ఆమెను గుర్తించడం లేదనే విషయం ఇప్పుడు అర్థమైంది. అందుకే కవిత కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించకుండానే రాజకీయం చేయాలనుకుంటున్నారు.
పార్టీ పెట్టేస్తారా?
కవిత జోరు చూస్తుంటే కొత్త పార్టీ పెట్టేలా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదగగలరా లేదా అనేది తేలాల్సి ఉంది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ రెండూ బీఆర్ఎస్ ని గడగడలాడిస్తున్నాయి. ఈ దశలో బీఆర్ఎస్ అనే ఊసే లేకుండా కొత్త పార్టీ పెడితేనే మనుగడ అని ఆలోచిస్తున్నారు కవిత. అసలైన తెలంగాణ సెంటిమెంట్ జాగృతి సంస్థదేనని అంటున్నారామె. గత 19 ఏళ్లలో తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టు, బతుకమ్మ, బోనం వంటి వాటి గురించి కొట్లాడామని, ఉద్యమకాలంలో తెలంగాణ యాసను అవహేళన చేసిన ఒక వ్యక్తికి నంది అవార్డు ఇవ్వడంపై నిరసన తెలిపామని చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న ఆంధ్రా సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అని వివరించారు కవిత. ఇక్కడ టీఆర్ఎస్, బీఆర్ఎస్ అనే పేర్లను కూడా కవిత ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే ఆమె పూర్తిగా కుటుంబానికి, పార్టీకి దూరం కావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ వేరు కుంపటిని బీఆర్ఎస్ నేతలు సహిస్తారా, తనకుటుంబంలోనే ఉన్న శత్రువుని కేటీఆర్ రాజకీయంగా ఎదగనిస్తారా అనేది వేచి చూడాలి.