MLC Mahesh Kumar Goud Comments on KCR, KTR: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర చిహ్నం విషయమై ఆయన మాట్లాడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వ పాలన ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, కేటీఆర్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్ కు అభ్యంతరం ఎందుకు? అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎప్పుడైనా అఖిల పక్ష సమావేశం నిర్వహించారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన అసలే ఉండబోదన్నారు. అందరితో చర్చించిన తరువాతనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లోటుపాట్లు, అభ్యంతరాలు లేకుండా చిహ్నం రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
Also Read: కేసీఆర్‌కు అందిన ప్రత్యేక ఆహ్వాన పత్రిక.. తీసుకున్న తరువాత ఏమన్నారంటే..?
అన్నీ తానే అన్నట్లుగా కేసీఆర్ ప్రజల్లో భ్రమలు కల్పించారన్నారు. తనకు తాను చక్రవర్తిగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వారందరికీ గౌరవం దక్కాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచిత స్థాయిలో సత్కరిస్తామంటూ ఎమ్మెల్సీ పేర్కొన్నారు.