Telangana BJP: ఒకానొక సమయంలో తెలంగాణలో బీజేపీ పాగా వేసేందుకు మెండుగా అవకాశాలు ఉన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు బీజేపీ, బీఆర్‌ఎస్ కు టఫ్ పైట్ ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు.. కానీ ఏమైందో ఏమో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ కాషాయం జెండా రెపరెపలాడింది.. లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే.. పార్లమెంట్ ఇంత మంది ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ హవా మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తెలంగాణలో బీజేపీ ఎంపీల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ పనితీరుపై ప్రధాని అసంతృప్తి..
తెలంగాణలో బీజేపీ పనితీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈరోజు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎంపీలతో నిర్వహించిన అల్పాహార సమావేశం సందర్భంగా.. తెలంగాణకు చెందిన పార్టీ ఎంపీలు, నాయకుల నిర్లక్ష్యంపై ఆయన ఘాటుగా మందలించారు. లోక్‌సభలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ.. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఇంకా ప్రధాన ప్రతిపక్ష స్థాయికి కూడా ఎదగలేకపోవడంపై మోడీ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.
పార్టీ గ్రాఫ్ ఎందుకు పెరగడం లేదు…?
పార్టీ అధిష్టానం ఎన్ని వనరులు సమకూర్చినా.. ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ ఎందుకు వెనుకబడిందనే విషయమై ప్రధాని నేరుగా ఎంపీలను ప్రశ్నించారు. ఈ వెనుకబాటుతనానికి కారణాలపై వివరంగా చర్చించిన మోడీ, పార్టీ నాయకత్వం, ఎంపీల మధ్య సమన్వయ లోపాన్ని ప్రధాన కారణంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇకనైనా వ్యక్తిగత విభేదాలు, వర్గ పోరాటాలు వీడి, సమిష్టిగా ఒకే లక్ష్యంతో పనిచేయాలని ఆయన ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
సోషల్ మీడియా యూనిట్ తీరుపై పీఎం అసహనం..
ప్రధాని మోడీ తన అసంతృప్తిని కేవలం మాటలకే పరిమితం చేయకుండా.. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఎంపీల ముందుంచడం గమనార్హం. ముఖ్యంగా.. సోషల్ మీడియా విషయంలో తెలంగాణ బీజేపీ యూనిట్ తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు, ముఖ్య నాయకులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపగలిగే విధంగా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోలేక పోతున్నారని మోడీ విమర్శించారు.
మరీ ముఖ్యంగా.. రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో గట్టి పట్టున్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా వేదికల కంటే కూడా బీజేపీ తెలంగాణ యూనిట్ వెనుకబడి ఉందని ప్రధాని పైరయ్యారు. దీనికి సంబంధించిన గణాంకాలను ఆయన నేతలకు చూపించారు. ‘ప్రజల్లో ఇంత ఆదరణ, అనుకూలత ఉన్నా, సామాజిక మాధ్యమాల ద్వారా ఆ మద్దతును ఓట్లుగా మలుచుకోలేకపోవడం నాయకత్వ వైఫల్యం కాదా?’ అని ఆయన సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా బీజేపీకి సోషల్ మీడియా ఒక ప్రధాన బలం కాగా, తెలంగాణలో అది బలహీనపడటంపై మోడీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమిష్టి కృషితోనే గ్రాఫ్ పెరుగుదల
రాష్ట్రంలో పార్టీ మరింత బలపడాల్సిన అవసరం ఉందని.. అందుకు అందరూ కలసికట్టుగా పని చేయాలని ప్రధాని మోడీ ఎంపీలకు హితవు పలికారు. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రధాన ప్రతిపక్షం లేకపోవడంతో.. ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించడానికి ఇది సరైన సమయమని ఆయన సూచించారు. కానీ, పార్టీలో అంతర్గత విబేధాలు, ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్టుగా నాయకులు పనిచేయడం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోతున్నారని మోడీ అభిప్రాయపడ్డారు. ‘కేవలం గెలిచిన ఎంపీ స్థానాలకే పరిమితం కాకుండా.. రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించాలి. ప్రతి ఎంపీ తమ పరిధిని దాటి, ఇతర జిల్లాల్లోనూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు, విజయాలను మాత్రమే చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలి’ అని ఆయన స్పష్టం చేశారు
పార్టీ కార్యకర్తలను, స్థానిక నాయకులను నిరంతరం ప్రోత్సహించాలని.. వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో నెలలో కనీసం పది రోజులు పర్యటించాలని, ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా తమ వంతు ప్రయత్నం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కేవలం ఢిల్లీ చుట్టూ తిరగడం కాకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజల సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని మోడీ ఉద్ఘాటించారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతానికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, అయితే ఆ చొరవను, దూకుడును రాష్ట్ర నాయకత్వం ప్రదర్శించాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీ పనిచేయాలని, అందుకు తగ్గట్టుగా పార్టీ గ్రాఫ్ పెరిగేలా ఎంపీలు సమిష్టిగా శక్తివంతంగా కృషి చేయాలని ప్రధాని మోడీ తన క్లాస్ ను ముగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ALSO READ: Palnadu Crime: సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్, నెక్ట్స్ ఏంటి?