Phone Tapping Case update: ఫోన్ ట్యాపింగ్ కేసు రేపో మాపో కొలిక్కి రానుందా? ఈ కేసులో కీలక నిందితులైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావు ఇండియాకు వచ్చే అవకాశాలున్నాయా? వారిద్దరు వస్తే బీఆర్ఎస్ మెడకు ఉచ్చు బిగుసుకునేనా? రాబోయే రోజుల్లో కారు పార్టీకి కష్టాలు తప్పవా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అమెరికాలో ట్రంప్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా నివాసముంటున్న వారిపై కొరడా ఝులిపించింది. ప్రభుత్వ దూకుడు వివిధ దేశాల ప్రజలు తట్టా బుట్టా సర్దుకుని తమతమ దేశాలకు పయనమవుతున్నారు. ఇక ఇండియా విషయానికొద్దాం. దాదాపు ఏడున్నర లక్షల మంది అక్కడ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తొలి విడతగా అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న 109 మంది ఇండియాకు చేరుకున్నారు.
అసలు విషయానికొద్దాం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికాలో స్థిరపడేందుకు గ్రీన్ కార్డు కోసం అప్లై చేశారు. అయితే లుక్ అవుట్ సర్య్కులర్ కారణం, మరోవైపు పాస్ పోర్టు జప్తు కారణంగా వారికి గ్రీన్ కార్డు లభించలేదు. ఈ క్రమంలో తమ పాస్ పోర్టు రద్దు చేయవద్దని వీరిద్దరు రీజినల్ పాస్ పోర్టు అధారిటీని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్నారు అక్కడి పోలీసులు.
తమను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని కోరుతూ అమెరికా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు ప్రభాకర్‌రావు. అమెరికాలో ఉండేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈలోగా అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నవారిపై ట్రంప్ సర్కార్ దృష్టి సారించింది.
ALSO READ: తెలంగాణలో బీసీ జనాభానే అధికం.. ఎవరి జనాభా నిష్పత్తి ఎంతంటే..
పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన డిపోర్టేషన్ పాలసీపై హైదరాబాద్ పోలీసులు తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. వీరిని త్వరగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేటలోని అమెరికా కాన్సులేట్‌తోపాటు విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ట్రంప్ సర్కార్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు రిమైండర్స్ ప్రొసీజర్స్‌ను చేపట్టినట్టు తెలుస్తోంది.
అమెరికాలో జరుగుతున్న పరిణామాలతో కీలక నిందితులు ఇండియాకు వచ్చే అవకాశమున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారిద్దరు ఇండియాకు వస్తే జైలు జీవితం తప్పదని అంటున్నారు. గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ అయినట్టు తేలడంతో అటువైపు కూడా కేంద్రం ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
నిందితులను తెలంగాణకు రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు క్రమంలో ఓ కొలిక్కి వస్తున్నాయి. ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు కాగా, శ్రవణ్‌రావు ఆరో నిందితుడిగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్‌పై గతేడాది మార్చి 10న కేసు నమోదు చేశారు పోలీసులు.
కేసు నమోదు కాగానే ప్రభాకర్రావు హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా అమెరికాకు వెళ్లినట్టు న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్లలో ప్రస్తావించారు. కానీ అసలు విషయం అదికాదని తెలుస్తోంది. పోలీసుశాఖలో ఉన్నతహోదాలో పని చేసి చివరకు జైలుకి వెళ్లాల్సి వస్తుందని భావించి అమెరికాకు వెళ్లిపోయారు. మనం ఒకటి తలస్తే.. కాలం మరొకటి చేస్తుందంటే ఇదేనేమో!