Karimnagar: కరీంనగర్‌లోని కేబుల్ బ్రిడ్జిపై బట్టలు ఆరబెట్టిన వైనం.. అయితే గత కొన్ని రోజులుగా కేబుల్ బ్రిడ్జి నిర్వహణ లేక వాహనదారులకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కేబుల్ బ్రిడ్జి కనీసం మూడేళ్లు గడవకముందే ఇలాంటి దుస్థితి వచ్చింది అని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ప్రభుత్వం మరమ్మతుల తేదిలను ఇంకా ప్రకటించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో మానేరు (మనైర్) నదిపై నిర్మించిన ఒక ప్రముఖ కేబుల్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి నిర్మాణం 2018 ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. ప్రారంభంలో దీని నిర్మాణ వ్యయం రూ. 183 కోట్లుగా అంచనా వేయబడింది. కానీ తరువాత ఇది రూ. 224 కోట్లకు పెరిగింది. టాటా ప్రాజెక్ట్స్, టర్కీకి చెందిన గులెర్మక్ సంస్థలు సంయుక్తంగా ఈ బ్రిడ్జిని నిర్మించాయి. బ్రిడ్జి మొత్తం పొడవు 500 మీటర్లు, ఇందులో రెండు పైలాన్లు ఉన్నాయి. ఇది నాలుగు లైన్ల రహదారిని కలిగి ఉంది. ప్రతి వైపు 1.5 మీటర్ల వెడల్పు పాదచారుల మార్గాలు, 0.5 మీటర్ కర్బ్, 1.5 మీటర్ల సెంట్రల్ మీడియన్ ఉన్నాయి. ముఖ్య స్పాన్ 220 మీటర్ల కేబుల్-స్టేడ్ భాగాలతో రూపొందించబడింది.
ఈ బ్రిడ్జి నిర్మించడానికి కరీంనగర్ నుండి మానకొండూరు, వరంగల్ వంటి పట్టణాలకు ప్రయాణ దూరాన్ని సుమారు 7 కి.మీ. తగ్గించడం, ఇప్పటికే ఉన్న బైపాస్ మనైర్ బ్రిడ్జి నుండి ట్రాఫిక్‌ను మళ్లించడం. అంతేకాకుండా, కరీంనగర్ అర్బన్ డెవలప్‌మెంట్ భాగంగా ఇది టూరిజం బూస్ట్ చేయడానికి నిర్మించబడింది. 2021లో ఇది ‘అవుట్‌స్టాండింగ్ కాంక్రీట్ స్ట్రక్చర్-2021’ అవార్డును గెలుచుకుంది. 2023 జూన్ 21న అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కె.టి. రామారావు (కెటిఆర్) చేతుల మీదుగా ఈ బ్రిడ్జి ప్రారంభించబడింది. ప్రారంభంలో ఇది హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి సమానంగా ప్రశంసలు అందుకుంద. నగర సౌందర్యాన్ని పెంచుతూ, కనెక్టివిటీని మెరుగుపరిచింది.
అయితే, ప్రారంభమైన మూడేళ్లు గడవకముందే ఈ బ్రిడ్జి దుస్థితికి చేరుకుంది. 2024లోనే, ఒక సంవత్సరం తిరగకముందే రోడ్ ఉపరితలం దెబ్బతినడం, వాటర్‌లాగింగ్, సైడ్ వాల్స్‌లో క్రాక్స్ వంటి సమస్యలు తలెత్తాయి. రోడ్ అండ్ బిల్డింగ్స్ అథారిటీలు విస్తృత మరమ్మతులు చేపట్టాయి, కానీ సమస్యలు కొనసాగాయి. 2025కు వచ్చేసరికి, నిర్వహణ లోపాలు మరింత తీవ్రమయ్యాయి. డైనమిక్ లైటింగ్ సిస్టమ్ (రూ. 8 కోట్ల వ్యయం), రెండు పెద్ద స్క్రీన్‌లు పనిచేయడం మానేశాయి. రోడ్ ఉపరితలం దెబ్బతిని, అసమానంగా మారింది, మరమ్మతులు అసంపూర్తిగా ఉన్నాయి. నిర్మాణ సంస్థలు, స్థానిక డిపార్ట్‌మెంట్ల మధ్య బాధ్యతలు స్పష్టంగా లేకపోవడం ఈ సమస్యలకు కారణంమంటున్నారు.
గత కొన్ని రోజులుగా, ఈ బ్రిడ్జి నిర్వహణ లేకపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ దెబ్బతినడంతో ట్రాఫిక్‌ను నిలిపివేశారు, పోలీసులు బారికేడ్‌లు, వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఫలితంగా, స్థానికులు మానేరు నదిలో బట్టలు ఉతికి, బ్రిడ్జి రోడ్‌పై ఆరబెట్టడం ప్రారంభించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, వీడియోలు వ్యాప్తి చెందాయి. ఒక వీడియోలో బ్రిడ్జి రోడ్‌పై రంగురంగుల బట్టలు, చాపలు వేసి ఆరబెట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి, బారికేడ్‌లు ఉన్నప్పటికీ కొంతమంది వాహనాలు దూరంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితి సోషల్ మీడియాలో తీవ్ర చర్చను రేపింది. నెటిజన్లు “ఇన్ని కోట్లు పెట్టి బ్రిడ్జి కట్టింది బట్టలు ఆరేసుకోడానికా?” అంటూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పబ్లిక్ మనీ వేస్ట్ అయిందని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: ఇవ్వేం పనులురా వెధవ! విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు
మున్సిపల్ కార్పొరేషన్, రోడ్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్లు బాధ్యతలు తీసుకోకపోవడంతో బ్రిడ్జి ఇప్పుడు పూర్తిగా ఉపయోగరహితంగా మారింది. ప్రభుత్వం మరమ్మతుల తేదీలను ప్రకటించలేదు, దీంతో స్థానికులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా, ఈ బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపాలు కారణంగా ఇప్పుడు ఒక దుర్దశకు చేరుకుంది. ఇది ప్రజా ధనం దుర్వినియోగానికి ఉదాహరణగా మారింది. తక్షణ మరమ్మతులు, సరైన నిర్వహణతో మళ్లీ ఉపయోగకరంగా మారాలని స్థానికులు ఆశిస్తున్నారు.