Munugode Last Day : ఈ రాత్రి అత్యంత కీలకం. గెలుపు ఓటములను టర్న్ చేసే శక్తి ఉంది ఈ రాత్రికి. మరో 10 గంటలు ఎవరు బాగా పని చేస్తే.. వారిదే విజయం. పని అంటే మరేదో కాదు.. గుట్టుచప్పుడు కాకుండా, పోలీసులకు దొరక్కుండా డబ్బులు పంచే పని. ఈ రాత్రికి ఎంత పంచితే.. గురువారం ఉదయం అన్ని ఓట్లు పడతాయనే నమ్మకం. అందుకే, ప్రధాన పార్టీలు డబ్బు సంచులతో రెడీగా ఉన్నాయి. పైసలు పంచడంలో బాగా అనుభవం ఉన్న వారిని ఇందుకోసం ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారు.
ఈసారి ఈసీ పకడ్బందీ నిఘా పెట్టడంతో డబ్బు పంపిణి కాస్త కష్టంగానే ఉందంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఓటుకు నోట్లు ఇచ్చేశారు. అయితే, ఓటుకు 10 వేలు పంచుతారనే ప్రచారం జరగ్గా.. తీరా డబ్బులిచ్చే టైమ్ కి చేతిలో 2 వేలు పెట్టేసి ఇది చాలు అంటున్నారు. మధ్యవర్తులు నొక్కేస్తున్నారో లేక, అంతే ఇస్తున్నారో తెలీదు కానీ.. పలు ప్రాంతాల్లో ప్రజలు నేతలపై తిరగబడుతున్నారు. తులం బంగారం.. 10 వేలు అన్నారు.. ఇదేంది ఇంతే ఇస్తున్నారంటూ కసురుతున్నారు.
మరోవైపు, ఈ రాత్రి అంతా పోలీసులు నాన్ స్టాప్ పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. ఈసీ బృందాలు సైతం ఓ కన్నేసి ఉంచాయి. ఇప్పటి వరకు 8 కోట్ల 20 లక్షల రూపాయలు సీజ్ చేశామని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. భారీగా మద్యం పట్టుకున్నామని.. కొన్నిచోట్ల బంగారం సైతం సీజ్ చేశామని తెలిపారు. నియోజకవర్గం సరిహద్దుల్లో మూసేసి.. చెక్ పోస్టుల దగ్గర పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నామన్నారు. మునుగోడులో ఇల్లిల్లు సోదా చేశామని చెప్పారు. ఒక్క పలివేలలో మాత్రమే ఘర్షణ జరిగిందని.. మిగతా నియోజకవర్గం అంతా ప్రశాంతంగా ఉందన్నారు సీఈసీ వికాస్ రాజ్. గురువారం పోలింగ్ సైతం ప్రశాంతంగా జరిగేలా చూస్తామని చెప్పారు.