Hyderabad News: హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో నాలా రోడ్డు మరోసారి కుంగింది. చాక్నవాడి దగ్గర ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. అదే సమయంలో ఆ రూట్లో వెళ్లున్న పలు వాహనాలు నాలాలో ఇరుక్కుపోయాయి. వాటిలో కారు, ఆటో, ట్రాక్టర్ ఉన్నాయి.
ఇప్పటికే నాలుగు సార్లు కుంగింది నాలా రోడ్డు. ప్రధాన రోడ్డు కావడంతో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు నాలా రోడ్డు కుంగుతుందని స్థానికులు మొరపెట్టుకున్న జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకోవడం లేదు.
నాలాకు సంబంధించిన రోడ్డును పూర్తిస్థాయిలో విచారణ చేసి, పటిష్టంగా నిర్మించాలని కోరుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేయించడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.
కుంగిన రోడ్డు గురించి సమాచారం అందుకున్న వెంటనే మేయర్ విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఘటన జరిగిన తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నాలా ఏ ప్రాంతం నుంచి వస్తుందని, ఎటు వైపు వెళ్తోందంటూ ఆరా తీశారు. గోషామహల్ నుంచి దారుస్సలాం వెళ్లే ప్రధాన రహదారుల్లో ఇది కూడా ఒకటి.
ALSO READ: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నిక.. మొదటిసారి దళిత వర్గ నేతకు అవకాశం..
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వెంటనే ఒకరోజు టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. తరచూ జరుగుతున్న ఘటనపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి. అధిక లోడుతో వచ్చే వాహనాలను నాలా రోడ్డుపై అనుమతించవద్దని మేయర్‌ను వ్యాపారులు కోరారు.