CPI Meetings :
⦿ 60 మందితో నూతన రాష్ట్ర కమిటీ
⦿ 14 మంది కార్యదర్శి వర్గ సభ్యులు
⦿ రాష్ట్ర కమిటీ సభ్యులుగా సంగారెడ్డి నుంచి గొల్లపల్లి జయరాజు ఎన్నిక
⦿ జయప్రదంగా ముగిసిన సీపీఐ (ఎం) రాష్ట్ర మహాసభలు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన మహాసభల్లో ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలను ఆమోదించారు. ముగింపు రోజు పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా, 14 మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జాన్ వెస్లీ సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో.. సుదీర్ఘ కమ్యునిస్ట్ పార్టీ చరిత్రలో తొలి దళిత కార్యదర్శిగా రికార్డు సాధించారు. ఇప్పటి వరకు అనేక రాష్ట్ర కమిటీలు ఎన్నికైనా ఎప్పుడూ హరిజన వర్గాలకు చెందిన వ్యక్తులకు కీలక పదవి దక్కలేదు. ఆ చరిత్రను మార్చుతూ.. తొలిసారి పార్టీ సీనియర్ దళిత నేతకు పార్టీ పగ్గాలు అప్పగించారు.
జాన్ వెస్లీకి సీపీఐ (ఎం) పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. దాదాపు 30 ఏళ్లకు ఆయన పార్టీలోని వివిధ బాధ్యతల్లో పని చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శ పదవుల్లో పని చేసిన జాన్ వెస్లీ.. సామాజిక న్యాయ సాధన కోసం సీపీఐ(ఎం) అనుబంధంగా ఉన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, కుల వివక్షకు వ్యతిరేకంగా మిలిటెంట్ పోరాటాలు నిర్వహించి సామాజిక స్రవంతిని ఐక్యం చేయడంలో ముఖ్య భూమిక వహించారు.
సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న జాన్ వెస్లీ పార్టీలో సుదీర్ఘ కాలం చేసిన పనికి గుర్తింపుగా పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం వర్గ ఉద్యమాలతో పాటు సామాజిక పోరాటాలు నడుపుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఓ దళిత వ్యక్తి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆ పార్టీ చరిత్రలో సరికొత్త అధ్యయనం అంటున్నారు.
నూతన కార్యదర్శిగా ఎన్నికైన జాన్ వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర మహాసభల్లో పలు అంశాలపై తీర్మానాలను ఆమోదించమన్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న కనీసం మద్దతు ధరల చట్టం సాధన తో పాటు భూనిర్వాసితులకు 2013 చట్టప్రకారం పరిహారం ఇవ్వాలని మహాసభ తీర్మానం చేసిందని తెలిపారు. నష్టపరిహారం విషయమై రైతన్నలను సమీకరించి పోరాటాలు చేపడతామని ప్రకటించారు.
రాష్ట్రంలో కోటిన్నర మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోకుండా దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు సమరశీలంగా పోరాటాలు నడపాలని మహాసభ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు సొంత ఇల్లు లేదని.. వారంతా సీపీఐ నాయకత్వంలో గుడిసెలు వేసుకొని పోరాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. అలాంటి వారందరి తరఫున ఉద్యమాలు చేపట్టేందుకు మహాసభ తీర్మానించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సీపీఎం రాష్ట్ర మహాసభ లో నూతనంగా 60 మందితో కమిటీ ఏర్పడింది. అందులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా టీ.జ్యోతి , జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, చుక్క రాములు, పోతినేని సుదర్శన్, టీ.సాగర్, ఎండీ అబ్బాస్, మల్లు లక్ష్మి, పాలడుగు భాస్కర్, బండా రవికుమార్, నున్న నాగేశ్వరరావు, ఎండి జహంగీర్, పీ ప్రభాకర్ ఎన్నికయ్యారు.
రాష్ట్ర కార్యదర్శిగా రిలీవ్ అయిన తమ్మినేని
తెలంగాణ రాష్ట్రంలో మూడు పర్యాయాలు జరిగిన రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శిగా ఎన్నికై సీపీఐ (ఎం) ఉద్యమాన్ని బలోపేతం చేసిన రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంగారెడ్డిలో జరిగిన మహాసభల్లో రిలీవ్ అయ్యారు. వయసు, ఆరోగ్య రీత్యా రాష్ట్ర కమిటీ బాధ్యత నుంచి ఆయన రిలీవ్ అయ్యారు. అదే విధంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులుగా పనిచేసిన చెరుపల్లి సీతారాములు కూడా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా రిలీవయ్యారు. సుదీర్ఘ కాలం రాష్ట్ర కార్యదర్శి వర్గంలో పనిచేసిన డీజీ నర్సింగరావు సైతం సంగారెడ్డి మహాసభలో రిలీవ్ అయ్యారు.
Also Read : గురుమూర్తి భార్యను క్రూరంగా చంపాడు.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ