Cyclone Aquan: ఆంధ్రప్రదేశ్ పైకి మరో తుఫాన్ దూసుకొస్తోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీంతో ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు తుఫాన్ అలర్ట్ జారీ అయింది. ఈ తుఫాన్ పేరును ఆక్వాన్‌గా నిర్ణయించారు. ఇటీవలే రెండు వరుస తుఫాన్లతో దెబ్బతిన్న ఏపీ ప్రజలు మరో విపత్తును ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం వాయుగుండం చెన్నైకి 840 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 1000 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని తీవ్రత పెరిగి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ, మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉది. అనంతరం నవంబర్ 20 కల్లా ఉత్తర కోస్తాంధ్ర తీరప్రాంతాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయని స్పష్టం చేసింది వాతావరణశాఖ.
ఏపీలో 17వ తేదీ నుంచే ఆక్వాన్ ప్రభావం..
తుఫాన్ ప్రభావంతో తీరంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని తెలిపారు. ఏపీలో 17వ తేదీ నుంచే ఆక్వాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు అధికారులు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్నారు. సముద్రం అత్యంత అలజడిగా మారనుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళరాదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సురక్షితంగా తీరానికి తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక చేసింది.
తెలంగాణపై కూడా ఆక్వాన్ తుఫాన్ ప్రభావం
తెలంగాణపై కూడా ఆక్వాన్ తుఫాన్ ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చంటున్నారు. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణశాఖ అధికారులు. నవంబర్ 20 నుంచి 22 వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో చలితీవ్రత కొనసాగుతోంది. నాలుగు జిల్లాల్లో 11 డిగ్రీల రేంజ్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్పంగా కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
Also Read: ఒకే ఒక్క నిర్ణయం.. 700 మంది క్రీడాకారుల జీవితాలను మార్చేసింది!