CM Revanth on Terror Attack: పాకిస్థాన్ కు వ్యతిరేకంగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్న.. సంపూర్ణంగా మద్దతు తెలుపుతామన్న సీఎం రేవంత్ రెడ్డిపై.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి హుందాగా వ్యవహరించారని పలువురు పోస్ట్ చేస్తున్నారు.
కాగా.. జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్‌లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు.ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్, భారత్ సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు.
మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఏకమై ఉగ్రవాదంపై పోరాడాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. భారత్‌లోకి చొచ్చుకొచ్చి.. పాక్ టెర్రరిస్టులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది ప్రజలు ప్రధాని వెంట ఉంటారని తెలిపారు. ఈ విషయంలో మోడీకి మద్దతు తెలుపుతున్నానని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. 1971లో పాకిస్థాన్‌కు ఇందిరాగాంధీ గట్టిగా బుద్ధి చెప్పారని.. ఆనాడు ఆమెను వాజ్‌పేయీ దుర్గామాతతో పోల్చిన విషయాన్ని గుర్తు చేశారు.
మరోసారి పాకిస్థాన్‌ను ఓడించాలని.. పీవోకేను భారత్‌లో కలపాలని చెప్పారు. ఇందిరాగాంధీని గుర్తుకుతెచ్చుకొని పాక్‌కు మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. అభివృద్ధి పథంలో నడుస్తున్న భారత్‌పై ఉగ్రదాడి జరిగిందని.. పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా ఉగ్రవాదంపై పోరు జరపాలని పేర్కొన్నారు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్-2025 పేరుతో ప్రభుత్వం ఏర్పాటుచేసిన.. అంతర్జాతీయ రాజకీయ సదస్సు తొలిరోజు హైటెక్స్‌లోని నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు తొలిరోజు వందకుపైగా దేశాల నుంచి 400 మందికిపైగా ప్రతినిధులు హాజరైనట్లు పీసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా కళారూపాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బోనాలతో కళాకారులు విదేశీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. పోలీసులు హోటల్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విదేశీ ప్రతినిధులు ఉదయం మూడు, నాలుగు బృందాలుగా విడిపోయి గ్రామీణ ఉపాధి హామీ పనులను వివిధ ప్రదేశాలకు వెళ్లి పరిశీలించి వచ్చారు.
హైటెక్స్‌లో మహాత్మాగాంధీ చరఖా తిప్పుతున్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహం ఆహూతులను ఆకట్టుకుంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు జాతీయ నేతలు సాధారణ ప్రతినిధుల మాదిరిగా సమావేశాల్లో పాల్గొన్నారు. తొలిరోజు ప్రారంభోత్సవ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి వస్తారని ముందు చెప్పినా వారు రాలేదు. రాహుల్‌గాంధీ కశ్మీర్ పర్యటనలో ఉన్నందున రాలేదని పార్టీ నేతలు తెలిపారు. రెండోరోజు ఇవాళ సాయంత్రం జరిగే ముగింపు సమావేశానికి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వస్తారని వెల్లడించారు.
Also Read: పహల్గాం ఉగ్రదాడి.. ఏపీ, తెలంగాణలోని ఈ 14 ప్రాంతాల్లో కేంద్రం హై అలర్ట్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై సమ్మిట్‌కు వచ్చిన విదేశీ ప్రతినిధులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అనాగరిక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘాతుకంలో 26 మంది అమాయక పౌరులు మరణించడం తమని కలచివేసిందని తెలిపారు. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం అన్నారు. ఈ దాడులను ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడిగా పరిగణిస్తామంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.