GHMC: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోనే అత్యధిక జనాభా నివసించే కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో బుధవారం నుంచి మొదలుకానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో పరిపాలన, పౌర సేవల నిర్వహణ, అభివృద్ది పనుల పర్యవేక్షణలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గత ఫిబ్రవరి 10వ తేదీ నుంచి కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు వేర్వేరుగా బాధ్యతలు నిర్వర్తించనున్నాయి. గత నెల నవంబర్ 25న కోర్ అర్బన్ రీజియన్ లోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీన ఆదేశాలు, ఆ తర్వాత హడావుడిగా విలీనం, ఆ తర్వాత ఫిబ్రవరి 11న మూడు కార్పొరేషన్ల ఏర్పాటు భౌగోళికంగా జరిగిపోయినా, అప్పులు, జీతాల చెల్లింపులు ఈ నెలాఖరు వరకు జీహెచ్ఎంసీ నుంచే జరుగుతున్నాయి.
మార్చి మాసం జీతాలు కూడా మూడు కార్పొరేషన్లకు జీహెచ్ఎంసీ నుంచే జరిపి, ఏప్రిల్ మాసం నుంచి మూడు కార్పొరేషన్లు ఎవరికి వారే వేర్వేరుగా చెల్లింపులతో పాటు ఇతర బాధ్యతలను నిర్వర్తించనున్నాయి. కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త బ్యాంక్ ఖాతాలను కూడా సమకూర్చనున్నారు. కానీ ఏప్రిల్ మాసంలో కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రాపర్టీ ట్యాక్స్ ను ముందే వసూలు చేసుకునేందుకు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద అయిదు శాతం రాయితీ ఇవ్వటంతో అత్యధికంగా పన్ను వసూలయ్యే అవకాశమున్నందున, మూడు కార్పొరేషన్లు ఈ స్కీమ్ ను వేర్వేరుగా అమలు చేయనున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరి లెక్కలు వారివే అన్నట్టుగా పనిచేయనున్నాయి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు వేర్వేరుగా నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల పనుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించనున్నాయి.
ఇకపై ప్రతి కార్పొరేషన్ పరిధిలో సరి కొత్త ఆర్థిక వ్యవస్థ అమల్లోకి రానుంది. హెడ్ ఆఫ్ అకౌంట్స్ కూడా విడిగా నిర్వహించనున్నారు. ఆదాయం, ఖర్చులు ( జీతభత్యాలు, ప్రాజెక్టుల పనుల చెల్లింపులు) సంబంధిత కార్పొరేషన్ పరిధిలోనే ఉంటాయి. ఎవరి అకౌంట్స్ వారివే, ఎవరి ఆదాయం వారిదే, ఎవరి ఖర్చులు వారివే అనే పద్ధతితో మూడు కార్పొరేషన్లలో ఒకదానికొకటి సంబంధం లేకుండా విధులు నిర్వర్తించనున్నాయి. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు ఇప్పటికే తమ తమ పరిధుల్లో పూర్తిస్థాయి పరిపాలన బాధ్యతలు చేపడుతున్నపటికీ ఆర్థిక వ్యవహారాల్లో కూడా పూర్తి స్వతంత్రంతో వ్యవహరించనున్నాయి. దీంతో పరిపాలన మరింత సమర్థవంతంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. పౌర సేవలు నిర్వహణ మరింత మెరుగుపడటంతో పాటు అధికారుల్లో జవాబుదారితనం పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Also Read: Minister Seethakka: ప్రతి గ్రామంలో.. ఫిర్యాదు బాక్సులు.. మంత్రి సీతక్క కీలక ఆదేశాలు
టెండర్ల బాధ్యత జీహెచ్ ఎంసీదే.. చెల్లింపులు మూడు కార్పొరేషన్లవి మూడు కార్పొరేషన్ల పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మొత్తం 7 లక్షలు 80 వేల పై చిలుకు స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం టెండర్ల బాధ్యతను జీహెచ్ఎంసీ నిర్వర్తించనుంది. టెండర్లు ఖరారై నిర్వాహణ సంస్థలు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇందుకయ్యే ఖర్చును మూడు కార్పొరేషన్లు చెల్లించనున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతలను ఏకంగా పదేళ్ల గడువుతో ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనుండటం, రానున్న వర్షాకాలాన్ని దృష్టి లో పెట్టుకుని ఈ మెయింటనెన్స్ బాధ్యతను కూడా జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు పంచనుంది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని స్ట్రీట్ లైట్లు మూడు కార్పొరేషన్ల పరిదిలో ఉన్నా, స్ట్రీట్ లైట్ల నిర్వహణ ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండనుంది.
సైబరాబాద్, మల్కాజ్ గిరి పరిధిలోని స్ట్రీట్ లైట్ల సంఖ్యను లెక్కకట్టి, అందుకైన వ్యయాన్ని జీహెచ్ఎంసీ ఆ రెండు కార్పొరేషన్ల నుంచి వసూలు చేసేందుకు గణాంకాలను సిద్దం చేస్తున్నట్లు తెలిసింది. ఇక రోడ్ల మెరుగైన నిర్వహణ కోసం చేపట్టిన కాంప్రహెన్సీవ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ (సీఆర్ఎంపీ), ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు సంబంధించిన పనులను కార్పొరేషన్ల వారికి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఆ ప్రాజెక్టుల పనుల వ్యయాన్ని మూడు కార్పొరేషన్లు వేర్వేరుగా చెల్లించనున్నాయి. సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లు తమ పరిధిలో జరిగిన పనులకు అనుగుణంగా బిల్లులు చెల్లించనున్నాయి. ప్రతి కార్పొరేషన్‌కు కేటాయించిన కోటా మేరకు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కొన్ని సేవలు, మెయింటనెన్స్ బాధ్యతలను కార్పొరేషన్ల వారీగా కేటాయించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిసింది.
Also Read: సత్తుపల్లిలో ఏసీబీ మెరుపు దాడులు కలకలం