BRS : ఉమ్మడి వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవానికి సిద్ధమవుతోంది. భారీ బహిరంగ సభతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ ఫాంహౌజ్‌లో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జిల్లాల వారీగా నేతలను పిలిపించుకుని.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. వరంగల్ సభ కోసం వందలాది బస్సులు బుక్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలా గులాబీ పండగ వేళ.. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేసు నమోదైంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో కౌశిక్‌రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ప్రచారం కూడా జరుగుతుండటం.. గులాబీ దళానికి షాకింగ్ న్యూసే.
కౌశిక్‌పై కేస్ ఏంటంటే..
తన భర్తను బెదిరించి రూ.25 లక్షలు తీసుకున్నారంటూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇప్పుడు మళ్లీ మరో రూ.50 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో తెలిపింది. డబ్బులు ఇవ్వకపోతే తన భర్తను, కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించారని అంటోంది. కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందామె. 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : జపాన్‌లో రేవంత్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. సీఎం ఫిదా..
కాంట్రవర్సీలకు కేరాఫ్ కౌశిక్‌రెడ్డి
పాడి కౌశిక్‌రెడ్డి. హుజురాబాద్ ఎమ్మెల్యే. ఆయన ప్రవర్తన ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టు ఉండదనే విమర్శ ఉంది. ఫైర్ బ్రాండ్ లీడర్ అనిపించుకోవాలనో, గులాబీ బాస్ మెచ్చుకోవాలనో.. గొడవలకు ముందుంటారని అంటారు. తానొస్తే పోలీసులు స్టేషన్‌లో ఉండటం లేదంటూ.. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేసిన ఉదంతం ఆయనది. విధులను అడ్డుకున్నారని ఆయనపై కేసు కూడా పెట్టారు పోలీసులు. ఇక అసెంబ్లీలో ఆయన చేసే హడావుడి అంతఇంతా కాదు. కౌశిక్‌రెడ్డి ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీనే అనే రేంజ్‌లో యాక్షన్, ఓవరాక్షన్ చేస్తుంటారని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు మండిపడుతుంటారు. ఇవన్నీ పొలిటికల్ యాంగిల్స్. రాజకీయాల్లో కాస్త కామనే అనుకోవచ్చు. కానీ, లేటెస్ట్ కేసు మాత్రం అలాంటిది కాదు. డబ్బుల కోసం వేధించడం. చంపుతానని బెదిరించడం. ఓ మహిళ ఫిర్యాదు చేయడం. మేటర్ చూస్తుంటే సీరియస్‌గానే ఉందని అంటున్నారు. సరిగ్గా బీఆర్ఎస్ రజతోత్సవ సమయంలోనే ఇలా నాన్ బెయిలబుల్ కేసు నమోదవడంతో పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఆ కేసులో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అవుతారా? బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగే ఏప్రిల్ 27నే అరెస్టుతో రజతోత్సవ గిఫ్ట్ ఇస్తారా? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చ..రచ్చ నడుస్తోంది. చూడాలి ఏం జరగనుందో…