Sri Nallapochamma Temple : కోరిన కోర్కెలు తీర్చాలని.. బాధలు, ఇబ్బందుల్ని తొలగించి తమను ఆశీర్వదించాలంటూ.. మనసారా కొలిచే అమ్మవారే కళ్ల ముందు ప్రత్యక్షమైతే.? అమ్మో అలాంటివి.. పురాణాలు, ఇతిహాసాల్లోనే కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి అంటారా ? కానీ.. ఈ కాలంలోనూ అలాంచి ఘటన ఒకటి జరిగింది. అదేంటో మీరు తెలుసుకుని.. అమ్మవారి లీలగా భావిస్తున్న విషయాన్ని తెలుసుకొండి.
భక్తులు నిత్యం పూజించే, కొలిచే ఆలయంలో దర్జాగా తిరుగుతున్నానని.. తన దగ్గరకు వచ్చిన అందరి సమస్యలు వింటున్నానని తెలిపితే… ఆశ్చర్యం, పరమాశ్చర్యం. అలాంటి అద్భుతాలు.. ఎప్పుడో.. నూటికో, కోటికో ఒకటి జరుగుతాయి అంటారా. అయితే.. అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. సాక్ష్యాత్తూ అమ్మవారే.. తన పాద ముద్రను భక్తుల కోసం విడిచివెళ్లిందంటూ.. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం అంటూ.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.
అమ్మా.. తల్లి. కాపాడు… అంటూ రోజూ మొక్కే భక్తులు కలలో కూడా ఊహించని సంఘటన. పూజలు, అర్చనలతో అమ్మవారిని ఆరాధించే పూజారులు సైతం తమ జీవితంలో చూస్తామనుకోని ఘటన. అమ్మవారు తన ఉనికిని తానే ప్రత్యక్షంగా అందరికీ కనిపించేలా చేస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు. అలాంటిదే.. హైదరాబాద్ లోని లాల్ దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో జరిగింది.
ఈ ఆలయంలో ఎప్పటిలానే అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. మొక్కులు చెల్లించుకున్న భక్తులు.. భక్తితో మనసులోని కోర్కెలు చెప్పుకుని, అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పిస్తున్నారు. అలా చేస్తుండగా.. నేలపై పసుపు పడిపోయింది. సాధారణంగా అయితే.. భక్తులు ఎవరూ పసుపుపై అడుగు వెయ్యరు. పసుపును లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. అలాంటి పసుపుపై.. కొద్దిసేపటి తర్వాత ఓ పాదం గుర్తు కనిపించింది. ఆ గుర్తు కూడా.. ఆలయంలో పూజలు అయిపోయిన తర్వాత ఏర్పడింది. దాంతో.. అందరి దృష్టి ఆ పాదం గుర్తుమీదే పడింది.
గర్భగుడిలో ఆసునులైన అమ్మవారు లేచి వస్తే.. ఏ దిశలో అయితే అడుగులు పడతాయో.. సరిగా అదే దిశలో ఆ పాదం గుర్తు ఉంది. పైగా.. భక్తులెవరూ ఆ దిశలో వచ్చేందుకు వీలులేని స్థితి. దీంతో.. పసుపులోని పాదం గుర్తు అమ్మవారి పాదమే అంటూ భక్తులు భక్తి భావంలో మునిగిపోయారు. ఈ కుడికాలి గుర్తు సాక్షాత్తూ అమ్మవారి ప్రతీకగా భావిస్తూ, భక్తిశ్రద్ధలతో “సాక్షాత్తూ అమ్మవారు వచ్చారని” అంటూ తమ ఆధ్యాత్మిక అనుభూతిలో లీనమయ్యారు. తమ కష్టాలను తొలగించేందుకు.. పోచమ్మ తల్లే స్వయంగా గుడిలో పూజలు అందుకుని.. బయటకు వెళ్లిందంటూ సంబురపడిపోతున్నారు
Also Read : అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం.. అధికారుల్లో మార్పు రావాలి.. మంత్రి సీతక్క
పసుపులో పాదం గుర్తు దర్శనమివ్వడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాంతో.. ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. పసుపులో ఏర్పడిన పాదం గుర్తు ప్రతీ ఒక్కరికీ అమ్మవారి దీవెనలుగా భావిస్తూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అద్భుత సంఘటన స్థానికంగా తీవ్రమైన చర్చకు కారణం కాగా.. తల్లీ కాపాడు అంటూ.. కోటి కోర్కెలతో భక్తులు ఆలయానికి పోటెత్తుతున్నారు.