Vehicle Registration: స్వేచ్ఛ బ్యూరో: వాహనాల రెజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల శాశ్వత నమోదు (ఫర్మినెంట్ రిజిస్ట్రేషన్) కోసం డీలర్ పాయింట్ ద్వారా దరఖాస్తుల సమర్పణకు బదులుగా ఆన్‌లైన్ విధానం అమల్లోకి తీసుకొస్తుంది.
రవాణా శాఖలో ఈ ఏడాది జనవరి 24 నుంచి డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానంను అమలులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి నాన్-ట్రాన్స్‌పోర్ట్ మోటార్ సైకిల్లు(ద్విచక్ర వాహనాలు), కార్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ కార్యాలయాలకు వాహనాన్ని చూపించే అవసరాన్ని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీలర్ పాయింట్ వద్దనే వాహన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవసరమైన పత్రాలు (ఇన్వాయిస్, ఫారం–21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారని, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుందని, దీంతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా పోయింది, వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. వాణిజ్య (ట్రాన్స్‌పోర్ట్) వాహనాలకు ఇది వర్తించడంలేదు.
అయితే డీలర్ పాయింట్ నుంచి ఫారం-20 (ఫైనాన్సియర్ సంతకంతో, అవసరమైతే),ఇతర పేపర్ ఆధారిత పత్రాలను స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా సంబంధిత ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల నుంచి సైతం రవాణాశాఖ(ఎస్టీఏ)కు ఫిర్యాదులు రావడంతో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 13 నుంచి నూతన విధానంను అమల్లోకి తీసుకొస్తున్నట్లు గురువారం రావాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక డీలర్లు ఆర్టీఏ కార్యాలయాలకు ఫారం-20, ఇతర పేపర్ పత్రాలను ఫిజికల్ గా సమర్పించే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై డీలర్లు వాహన యజమాని, ఫైనాన్సియర్ (అవసరమైతే) సంతకాలతో కూడిన ఫారం-20, ఇతర పత్రాల స్కాన్ కాపీలను మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. శుక్రవారం తర్వాత జారీ అయ్యే టెంపరరీ రిజిస్ట్రేషన్లు (టీఆర్) ఉన్న వాహనాలకు ఫిజికల్ పత్రాలు ఆర్టీఏ కార్యాలయాలు స్వీకరించబడవు అన్నారు. ఈ నెల 13కు ముందు టీఆర్ పొందిన వాహనాలకు కూడా, డీలర్లు ఫారం-20, ఇతర పత్రాల స్కాన్ కాపీలు అప్లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: Dialysis Centres: కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!
డీలర్లు అప్లోడ్ చేసే పత్రాల కు పూర్తి బాధ్యత వారిదే. తప్పుడు లేదా నకిలీ పత్రాలు సమర్పించినట్లయితే క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీఏ కార్యాలయాల్లో అందిన ఆన్‌లైన్ దరఖాస్తులను రెండు పని దినాల్లోపే పరిశీలించి ఆమోదం లేదా రివ్యూ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. డీలర్లు తమ వద్ద 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ఉల్లంఘన జరిగినట్లయితే వారి లాగిన్ నిలిపివేయబడుతుంది, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని జీవోలో పేర్కొన్నారు. అన్ని అధీకృత ఆటోమొబైల్ డీలర్లు పై మార్పులను గమనించి, వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఫారం-20, ఇతర పత్రాలను కేవలం ఆన్‌లైన్ విధానంలోనే సమర్పించాలని తెలిపారు.
రవాణా శాఖ అధికారులు అవసరమైతే అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై యాదృచ్ఛిక తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రికార్డులు పరిశీలించనున్నారు. షోరూంల డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన, డిజిటల్, సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని అధికారులు వెల్లడించారు. ఏది ఏమైనా రవాణశాఖలో మాత్రం ప్రభుత్వం సాంకేతిక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Also Read; Hyderabad Major Fire: మియాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన ఫర్నిచర్ షాపు, ఏం జరిగింది?