Padma: రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు తాగే ORSను తయారు చేసిన దిలీప్ కి మరణానంతరం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషన్ వరించింది.
మొత్తం 106 పద్మ పురస్కారాలు ప్రకటించారు. ఆరుగురికి పద్మవిభూషన్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. ములాయం సింగ్ యాదవ్, ఎం.ఎస్.కృష్ణలకు పద్మవిభూషన్ ఇచ్చారు.
తెలంగాణ నుంచి ఇద్దరికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. చినజీయర్ స్వామికి, కమలేశ్ బి పటేల్(దాజీ)కి, గాయని వాణి జయరాం, సుదామూర్తిలకు పద్మభూషన్ పురస్కారం లభించింది.
తెలంగాణకు 2 పద్మశ్రీలు, ఏపీ నుంచి ఏడుగురికి పద్మశ్రీలు వచ్చాయి. సంగీత దర్శకులు కీరవాణికి పద్మశ్రీ పురష్కారం వరించింది.
ఏపీ నుంచి సంకురాత్రి చంద్రశేఖర్ కు.. తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డికి.. పద్మశ్రీ పురస్కారం లభించింది.
కాకినాడకు చెందిన సంకురాత్రి చంద్రశేఖర్ ప్రముఖ శాస్త్రవేత్త, సంఘ సేవకులు. కాకినాడలో సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్ స్థాపించారు. సుమారు 3 లక్షల మందికి ఉచితంగా నేత్ర చికిత్స అందించారు. శారదా విద్యాలయంలో వేలాది మందికి విద్యాదానం చేశారు. ఇలా, విద్య, వైద్య విభాగంలో ఎనలేని సేవ చేశారు.
చంద్రశేఖర్ రాజమండ్రిలో చదువుకున్నాడు. ఆంధ్రా యూనివర్సిటీలో M.Sc. చేశారు. 1967లో కెనడాలో జీవశాస్త్రంలో పి.హెచ్.డి. చేసి.. కెనడా హెల్త్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేశారు. 1985 జూన్ 23న ఉగ్రవాదులు పేల్చివేసిన కనిష్క విమానంలో భార్య మంజరి, కుమార్తె శారద, కుమారుడు శ్రీ కిరణ్ లను పోగొట్టుకున్నారు. ఈ దుర్ఘటన తరువాత కాకినాడ వచ్చేసి.. కుమారుడి పేరుమీదుగా శ్రీ కిరణ్ నేత్ర విజ్ఞాన సంస్థను ప్రారంభించి.. సంకురాత్రి ఫౌండేషన్ తో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. గతంలో CNN హీరోగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి.. సంకురాత్రి చంద్రశేఖర్ ను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తోంది.