Palnadu Water Grid: స్వేచ్ఛ బ్యూరో: నాగార్జునసాగర్ జలాశయం కేంద్రంగా మొదలైన పల్నాడు వాటర్‌గ్రిడ్ వివాదం తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగర్ కుడివైపు ప్రాంతంలో చేపట్టిన భారీ తాగునీటి ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జలవివాదానికే పరిమితం కాకుండా తెలంగాణ నీటిపారుదల శాఖలో బాధ్యతల సంక్షోభంగా మారింది. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకానికి సంబంధించి మూడు ఇన్‌టేక్ వెల్స్, అనుబంధ నిర్మాణాలు, నీటి నిల్వకు ట్యాంకుల నిర్మాణం సాగుతున్నాయి. పల్నాడు ప్రాంతంలోని 363 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 1.865 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలన్నది ఏపీ ప్రతిపాదన. ఈ పనులు ఎనిమిది నెలలుగా సాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఎందుకు అప్రమత్తం కాలేదన్నది ప్రశ్నగా మారింది.
మరోవైపు ఏపీ ప్రాజెక్టు పనులు సాగుతున్న విషయం నాగార్జునసాగర్ వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు తెలియదా? తెలిసినా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదా? ఇచ్చినా శాఖ మంత్రికి చేరలేదా? మంత్రి స్థాయిలో ముందే సమాచారం ఉంటే నిర్మాణాలు ఇంతవరకు ఎలా కొనసాగాయి? అన్న ప్రశ్నలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. ఒకవైపు క్షేత్రస్థాయి అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తుండగా, మరోవైపు ప్రభుత్వ స్థాయిలో జరిగిన జాప్యంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎనిమిది నెలలుగా పనులు.. నిఘా ఏమైనట్టు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు వాటర్‌గ్రిడ్ కోసం జనవరిలో టెండర్ల ప్రక్రియ చేపట్టగా, మార్చిలోనే సర్వే, నిర్మాణాలకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఆగస్టు 4న ఈ పథకానికి సంబంధించి జీవో జారీ చేసింది. నాగార్జునసాగర్ కుడివైపు విజయపురి సౌత్ ప్రాంతంలో మూడు ఇన్‌టేక్ వెల్స్ నిర్మాణంతోపాటు అనుబంధ పనులు చేపట్టింది. నవంబరు నాటికి పనులు దాదాపు 20 శాతం పూర్తయినట్లు తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఇంత బహిరంగంగా పనులు సాగుతున్నా తెలంగాణ ఇరిగేషన్ యంత్రాంగం ఎందుకు గుర్తించలేకపోయింది? జలాశయానికి సంబంధించిన కీలక నిర్మాణాల వద్ద యంత్రాలు, భారీ సామగ్రి, కార్మికులు పనిచేస్తున్నా స్థానిక అధికారులు ఎందుకు స్పందించలేదు? ఇది సాధారణ నిర్లక్ష్యమా? లేక తెలిసీ పట్టించుకోలేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్టు ద్వారా 1.865 టీఎంసీల నీటిని తీసుకునే ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నీటిని తీసుకునే స్థాయి, జలాశయ నిల్వలపై దాని ప్రభావం, అవసరమైన అనుమతుల అంశాలపై ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏపీ మాత్రం పల్నాడు ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసమే ఈ పథకాన్ని చేపడుతున్నామని వాదిస్తోంది.
మంత్రికి తెలియకుండానే పనులు సాగాయా?
ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ప్రకటనలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంశాన్ని ముందుగానే గుర్తించిందని, కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు తెలిపామని వెల్లడించారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారుల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతుంది.ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. ప్రభుత్వం ముందుగానే ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకుని ఉంటే నిర్మాణాలు ప్రారంభమైన మార్చి నుంచే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు? ఆగస్టు 4న ఏపీ జీవో జారీ చేసినప్పుడే ఎందుకు కేఆర్ఎంబీని అప్రమత్తం చేయలేదు? ప్రభుత్వానికి తెలియకపోతే మంత్రి ఉత్తమ్ ముందే సమాచారం ఉందని ఎందుకు చెబుతున్నారు? తెలిసి ఉంటే క్షేత్రస్థాయి అధికారులకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు?ప్రభుత్వ వాదన, మంత్రుల ప్రకటనలు, క్షేత్రస్థాయి అధికారులపై తీసుకుంటున్న చర్యల మధ్య స్పష్టత లేకపోవడం రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.
సాగర్‌లో అధికారులు స్థానికంగా ఉండరా?
నాగార్జునసాగర్ వంటి అంతర్రాష్ట్ర జలాశయం వద్ద విధులు నిర్వహించే అధికారులకు నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకం. జలాశయానికి సంబంధించిన నిర్మాణాలు, నీటి వినియోగం, ఇతర రాష్ట్రాల కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాల్సిన బాధ్యత వారిదే. అలాంటి ప్రాంతంలో ఏపీ నిర్మాణాలు సాగుతుంటే గుర్తించకపోవడం ఎలా సాధ్యమన్నది ప్రశ్నలకు దారితీస్తుంది.స్థానికంగా అధికారులు అందుబాటులో ఉండటం లేదా? పర్యవేక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేదా? క్షేత్రస్థాయి ఇంజినీర్లు గుర్తించిన సమాచారాన్ని పైస్థాయికి పంపలేదా? అన్న కోణాల్లో విచారణ సాగుతోంది.ఇప్పటికే నాగార్జునసాగర్ సీఈ, నల్గొండ జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వం నివేదికలు కోరింది. నివేదికలు అందినట్లు సమాచారం. సూపరింటెండింగ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ స్థాయిలోనూ వివరణలు కోరారు. ఇది ఇలా ఉంటే ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశామని చెబుతుండగా, తమకు నోటీసులు అందలేదని స్థానిక అధికారులు చెప్పుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామం శాఖలో సమన్వయంపై సందేహాలకు తావిస్తోంది.
ఏపీకి సహకరించారా?
ఈ వ్యవహారంలో ఉద్దేశపూర్వక సహకారం ఉందా? అన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. నిర్మాణాలు జరుగుతున్న విషయం స్థానిక అధికారులకు తెలిసి కూడా పైస్థాయికి చేరవేయకుండా ఆపారా? ఏపీ అధికారులతో సమన్వయం పేరుతో తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారా? అన్న అంశాలను అన్ని కోణాల్లోనూ ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంది.ప్రభుత్వం నిజంగా బాధ్యులను గుర్తించాలనుకుంటే కేవలం కింది స్థాయి సిబ్బందిని ప్రశ్నించడం కాకుండా, సమాచారం ఏ స్థాయిలో నిలిచిపోయిందో కూడా తేల్చాల్సి ఉంటుంది.
ఇద్దరు సీఈలు సెలవుపై వెళ్లడం వెనుక?
ఇరిగేషన్ శాఖలో ఇద్దరు కీలక చీఫ్ ఇంజినీర్లు సెలవుపై వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. మంచిర్యాల సీఈ నరసింహమూర్తి, నాగర్‌కర్నూల్ సీఈ విజయభాస్కర్‌రెడ్డి ఇటీవల సెలవులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కీలక ప్రాజెక్టులకు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.నరసింహమూర్తి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన బాధ్యతలు చూస్తుండగా, విజయభాస్కర్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పరిధిలో ఉన్నారు. కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్న సమయంలో ఇద్దరు సీఈలు సెలవుపై వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే వ్యక్తిగత కారణాలు, పని ఒత్తిడి కారణంగానే సెలవులు తీసుకున్నట్లు శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇలాంటి కీలక సమయంలో ఉన్నతాధికారుల అందుబాటు, బాధ్యతల బదిలీ, పర్యవేక్షణ వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఏపీ అధికారుల పెత్తనమంటూ ప్రచారం
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ఏపీకి చెందిన అధికారులకు ప్రాధాన్యం పెరుగుతోందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల, జలవనరుల శాఖ సలహాదారుగా నియమించడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు పల్నాడు వాటర్‌గ్రిడ్ వివాదం నేపథ్యంలో ఆ పాత విమర్శలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.బీఆర్ఎస్ నేతలు సలహాదారు నియామకాన్ని ప్రశ్నిస్తూ, తెలంగాణ నీటి ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాల్లో ఏపీ నేపథ్యం ఉన్న వ్యక్తులకు ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్ని లేవనెత్తుతున్నారు.
బీఆర్ఎస్ దాడి.. సర్కార్‌కు రాజకీయ చిక్కులు
పల్నాడు వాటర్‌గ్రిడ్ వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీ నేతలు ప్రభుత్వం ముందుగానే స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. 8 నెలలుగా పనులు సాగుతుంటే ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి, ఉన్నతాధికారులకు తెలియకపోవడం ఎలా సాధ్యమని నిలదీస్తున్నారు.ఏపీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందే అప్రమత్తమై ఉంటే నిర్మాణాలు ఈ స్థాయికి చేరేవి కావని ప్రతిపక్షం వాదిస్తోంది. మరోవైపు ప్రభుత్వం మాత్రం తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.ఈ వివాదం కారణంగా ఇరిగేషన్ శాఖలో అధికారుల నియామకాలు, సలహాదారుల పాత్ర, అంతర్రాష్ట్ర జలవివాదాల నిర్వహణపై కూడా రాజకీయ చర్చ మొదలైంది.
కేఆర్ఎంబీ స్పష్టత
పల్నాడు వాటర్ గ్రిడ్ పై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ రాయగా గురువారం స్పష్టత ఇచ్చింది.మిగులు లేదా కేటాయించని జలాలు ఉన్నాయన్న అంచనాతో ప్రాజెక్టులు నిర్మించినంత మాత్రాన ఆ నీటిపై చట్టబద్ధమైన హక్కు లభించదని కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను ట్రిబ్యునల్ మాత్రమే ఖరారు చేస్తుందని పేర్కొంది.
అసలు బాధ్యత ఎవరిది?
పల్నాడు వాటర్‌గ్రిడ్ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి మూడు స్థాయిల్లో సవాలుగా మారింది. మొదటిది.. సాగర్ వద్ద క్షేత్రస్థాయి పర్యవేక్షణలో లోపాలుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవడం. రెండోది.. ఉన్నతాధికారులు, శాఖ మంత్రి, ప్రభుత్వ స్థాయిలో సమాచారం ఎప్పుడు అందిందో తేల్చడం. మూడోది.. ఏపీ చేపట్టిన నిర్మాణాలపై చట్టపరంగా తెలంగాణ అభ్యంతరాలను బలంగా వినిపించడం.కేవలం కింది స్థాయి అధికారులకు నోటీసులు ఇచ్చి వ్యవహారాన్ని ముగిస్తే అసలు ప్రశ్నలకు సమాధానం దొరకదు. ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందా? ఉంటే చర్యలు ఎందుకు ఆలస్యమయ్యాయి? లేదంటే రాష్ట్ర స్థాయిలో అంతర్రాష్ట్ర జలవివాదాలపై నిఘా వ్యవస్థ ఎందుకు విఫలమైంది? అన్నది తేలాల్సిందేనని ఇరిగేషన్ నిపుణులు కోరుతున్నారు.
పల్నాడు వాటర్‌గ్రిడ్ వివాదంలో అసలు దోషులెవరు..?
ఏది ఏమైనప్పటికీసాగర్ నీటి ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండకూడదు. అదే సమయంలో బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకోవడం, బాధ్యత ఉన్నవారిని వదిలేయడం కూడా జరగకూడదు. సాగర్ వద్ద ఏపీ పనులు ఎలా మొదలయ్యాయి? తెలంగాణ అధికార యంత్రాంగం ఎందుకు గుర్తించలేకపోయింది? ప్రభుత్వానికి తెలిసినా ఎందుకు ఆలస్యంగా స్పందించింది? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలే పల్నాడు వాటర్‌గ్రిడ్ వివాదంలో అసలు దోషులెవరో తేల్చనున్నాయి.
Also Read: మంత్రులు, సీఎం తీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి నిజమేనా? 27న సందీప్ ముందు తేలనున్న లెక్క!