Chandrababu Naidu: పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మార్కెట్‌లో ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఏడాది కాలానికి సరిపడా ఒక పక్కా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసరాల ధరల నియంత్రణపై అమరావతిలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నెలకు రూ.100 కోట్ల కేటాయింపు
ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుడి జేబుపై పడకుండా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద నెలకు రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ధరల హెచ్చుతగ్గులపై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా, ప్రతి వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు.
రైతుకు లాభం.. వినియోగదారుడికి ఊరట
ధరల నియంత్రణ పేరుతో తీసుకునే చర్యలు ఏ ఒక్కరికీ నష్టం కలిగించకూడదని సీఎం తేల్చిచెప్పారు. పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి, అదే సమయంలో కొనుగోలు చేసే వినియోగదారుడిపై అదనపు భారం పడకూడదని దిశానిర్దేశం చేశారు. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేలా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.
బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం
కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యంగా బియ్యం నిల్వలు పక్కదారి పట్టకుండా, బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ప్రగతినగర్ వాసులకు గుడ్ న్యూస్.. అంబీర్ చెరువు పనులు షురూ!