Congress High Command: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా నడుస్తున్న అసంతృప్తులపై హైకమాండ్ సీరియస్‌గా దృష్టి సారించింది. ‘పార్టీలో మీకున్న అభ్యంతరాలు ఏమున్నాయి..? ప్రభుత్వంతో సమన్వయం కుదిరిందా..? సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమస్యలున్నాయా?’ అనే అంశాలపై నేరుగా ఎమ్మెల్యేల నుంచే అభిప్రాయాలు సేకరించేందుకు ఏఐసీసీ సిద్ధమైంది. దీనిలో భాగంగానే ఈ నెల 27న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సందీప్ ఈ టాపిక్ పై స్క్రీనింగ్ చేయనున్నారు. అందరి ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి,పాలన తీరుపై ఏఐసీసీ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోంది. ముఖ్యంగా కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉందనే వార్తలు, నియోజకవర్గాల అభివృద్ధి నిధులు,నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో నెలకొన్న జాప్యంపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు అధిష్టానం దృష్టికి వెళ్లింది. కొందరు శాసన సభ్యులు బహిరంగంగానే కామెంట్లు చేస్తుండగా, మరి కొందరు అంతర్గత సమావేశాల్లో, సన్నిహితుల వద్ద నేతలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమస్య ముదరకముందే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు.
‘వన్ టూ వన్’ భేటీలో డిస్కషన్ ఇవే..?
ఈ నెల 27న జరగనున్న ముఖాముఖి సమావేశాల్లో ఎమ్మెల్యేల నుంచి పారదర్శకంగా అభిప్రాయాలు తీసుకోవాలని ఏఐసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా నాలుగు అంశాలపై ఆరా తీయనున్నారు.పీసీసీ కార్యవర్గ కూర్పు, జిల్లా స్థాయి నాయకత్వం, పార్టీ కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అభ్యంతరాలపై నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.అంతేగాక ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడంలో అధికార యంత్రాంగం, పార్టీ నేతల మధ్య సమన్వయం సరిగ్గా ఉందా? లేదా? అనే దానిపై ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. మంత్రులు తమ జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలుపుకొని పోతున్నారా? సీఎం వద్దకు సమస్యలు తీసుకెళ్లే విషయంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య ఏవైనా విభేదాలు ఉన్నాయా? అనే అంశాలపై నిక్కచ్చిగా వివరాలు సేకరించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీలో, ప్రభుత్వంలో చేయాల్సిన మార్పులు (ఛేంజెస్), అమలు చేయాల్సిన కొత్త వ్యూహాలపై (స్ట్రాటజీలు) ఎమ్మెల్యేల సలహాలు తీసుకోనున్నారు.
రాహుల్ దూతగా సందీప్ ఎంట్రీ.. ప్రాధాన్యత ఏమిటి?
ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాహుల్ గాంధీ తన అత్యంత విశ్వసనీయుడైన సందీప్‌ను ప్రత్యేక దూతగా పంపిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.రాష్ట్ర నాయకత్వానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కావడంతో, ఎమ్మెల్యేలు ఎలాంటి భయం, మొహమాటం లేకుండా తమ మనసులోని మాటను సందీప్ ముందు బయటపెట్టే అవకాశం ఉంటుందని హైకమాండ్ భావిస్తోంది.పైగా ఎమ్మెల్యేలు చెప్పే ప్రతి అంశాన్ని నిక్షిప్తం చేసి, ఎలాంటి ఫిల్టర్ లేకుండా నేరుగా రాహుల్ గాంధీకి నివేదిక అందజేయనున్నారు.ఇక పనితీరు సరిగా లేని మంత్రులు, నేతల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నివేదిక కీలకం కానుంది.నామినేటెడ్ పోస్టుల భర్తీ,మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కూడా ఈ భేటీల తర్వాతే అధిష్టానం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
Also Read: చిరంజీవి లేఖతో కదిలిన కేంద్రం.. డీప్‌ఫేక్, మార్ఫింగ్‌పై కొత్త చట్టానికి కిషన్ రెడ్డి సంకేతం