Mahesh Kumar Goud: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ఆయన ఘాటుగా స్పందించారు. గాంధీ అనే పదం వినిపిస్తేనే మోడీ, అమిత్ షాలకు వణుకు పుడుతుంది అంటూ వ్యాఖ్యానించారు. గాంధీ పేరు తొలగిస్తే తమకు శాశ్వత ఉపశమనం కలుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతలను ఉద్దేశించి వీళ్లు గాడ్సే వారసులు అని తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా సోనియా గాంధీ కుటుంబాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం వల్లే గాంధీ పేరుపై దాడులు చేస్తున్నారని అన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించడం అంటే కేవలం ఒక పేరును మార్చడం కాదు, యావత్ దేశానికే అవమానం చేయడమేనని స్పష్టం చేశారు.
సంఖ్యాబలం ఉందన్న అహంకారంతో పార్లమెంట్‌లో బిల్లులు పాస్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. మహాత్మా గాంధీ పేరు మార్చవచ్చు కానీ, ప్రపంచం ఉన్నంత కాలం గాంధీ పేరు ప్రజల హృదయాల్లో నిలిచే ఉంటుంది అని స్పష్టం చేశారు. గాంధీ సిద్ధాంతాలు, ఆయన త్యాగం, అహింసా మార్గం దేశ ప్రజల మనస్సుల్లో చెరిగిపోనివని అన్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం.. మొదటిగా మన్రేగా నిధులకు కోత పెట్టిందని గుర్తు చేశారు. అప్పుడే గాంధీ పేరుపై బీజేపీకి ఉన్న ద్వేషం బయటపడిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే పరంపరలో మహాత్మా గాంధీ పేరును మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మోడీ, అమిత్ షా ఎంతటి కుతంత్రాలు చేసినా మహాత్మా గాంధీ పేరును ప్రజల హృదయాల నుంచి చెరపలేరని స్పష్టం చేశారు.
కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా కూడా బీజేపీకి బుద్ధి రావడం లేదని విమర్శించారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం, అదే రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. ఖబర్దార్ మోడీ.. ఎన్ని కుట్రలు చేసినా మీ పప్పులు ఉడకవు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్లీ మహాత్మా గాంధీ పేరుకు గౌరవం తీసుకువస్తామని.. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలంతా గాంధీ సిద్ధాంతాల వైపే ఉన్నారని, బీజేపీ ప్రయత్నాలు తాత్కాలిక రాజకీయ లాభాలకే పరిమితమవుతాయని అన్నారు. చివరికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
Also Read: కాళేశ్వరం కూలడానికి కారణం ఆ సంస్థే.. ఎల్ అండ్ టీపై క్రిమినల్ కేసు..
అదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై కూడా ఆయన స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. పంచాయితీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సింగిల్ డిపాజిట్ కూడా రాకపోవడం ప్రజల్లో ఆ పార్టీకి ఉన్న స్థితిని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. గ్రామస్థాయిలో బీజేపీకి ఎలాంటి ఆదరణ లేదని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు.