Telangana Rice: తెలంగాణ బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. దేశంలోని 11 రాష్ట్రాలతో పాటు.. విదేశాల నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఫిలిప్పీన్స్ నుంచి బియ్యం కావాలంటూ తెలంగాణ పౌర సరఫరాల శాఖకు రిక్వెస్టులు అందాయి. ఇప్పటికే ఆ దేశ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు కూడా జరుపుతోంది. అయితే ఫిలిప్పీన్స్ దొడ్డు రకం బియ్యం కావాలని కోరుతోంది. నిజానికి ఆ దేశం ఇప్పటికే లక్ష టన్నుల బియ్యం తీసుకుంటుంది కూడా. మరో తొమ్మిది లక్షల టన్నుల వరకు కావాలని కోరుతోంది ఫిలిప్పీన్స్. అయితే ఇందులో బియ్యం రూపంలో కొంచెం.. ధాన్యం రూపంలో కొంచెం.. ఇవ్వాలని కోరుతోంది ఫిలిప్పీన్స్.
సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించే కస్టమ్ మిల్లింగ్ రైస్‌లో 25 శాతం వరకు నూకలకు అనుమతి ఉంటుంది. ప్రజాపంపిణీ వ్యవస్థలోనూ ఇదే విధానంలో బియ్యాన్ని అందజేస్తారు. అయితే ఫిలిప్పీన్స్ సర్కారు మాత్రం ఈ నిష్పత్తికి అంగీకకరించలేదు. తమ దేశానికి పంపించే బియ్యంలో 50 శాతం వరకు నూకలు ఉన్నా పర్వాలేదని చెప్పినట్టు తెలుస్తోంది.
నిజానిక ధాన్యం సేకరణ ప్రక్రియలో ఖరీఫ్ సీజన్ నుంచి బ్యాంకు గ్యారంటీ వంటి నిబంధనలను ప్రభుత్వం విధించింది. దాంతో కొందరు మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్‌కు దూరంగా ఉంటామని తెలిపారు. మరికొందరు తాము తీసుకున్న వడ్లను బియ్యంగా ఇచ్చేందుకు ఏడాది, రెండేళ్ల వరకు టైమ్ తీసుకుంటున్నారు. ఈ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇచ్చి, వాటిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసిన తర్వాతే పౌరసరఫరాల శాఖకు డబ్బులు అందుతున్నాయి. మరోవైపు రైతుల నుంచి ధాన్యం సేకరణకు బ్యాంకుల నుంచి ఏటా వేల కోట్ల అప్పులు చేస్తోంది. మిల్లర్లు ఆలస్యం చేస్తుండటంతో వందల కోట్ల వడ్డీని అదనంగా భరించాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కూల్చివేతల జాబితాలో పార్టీ ఆఫీసు?
బియ్యాన్ని ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తే అదనపు వడ్డీల భారం ఉండబోదంటున్నారు అధికారులు. దీనికి తగ్గట్టుగానే డబ్బులను 60 రోజుల్లోనే చెల్లించేలా ఫిలిప్పీన్స్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే మిల్లర్ల బెదిరింపులకు చెక్ పడినట్టే. ఇక దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. 11 రాష్ట్రాలు తెలంగాణ బియ్యంపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో బియ్యం నాణ్యత పెరిగిందని.. అందుకే దేశవ్యాప్తంగా డిమాండ్ కూడా పెరిగిందంటున్నారు నిపుణులు.