Phone Tapping Case Investigation: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? కేసు దర్యాప్తు స్పీడ్ తగ్గిందా? కీలక వ్యక్తుల కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారా? ఇంతకీ వాళ్లు హైదరాబాద్‌కు వస్తారా? అమెరికా నుంచి మరేదైనా దేశానికి వెళ్లారా? దర్యాప్తు మళ్లీ వేగవంతం అవుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు కాస్త సైలెంట్ అయ్యింది. ఈ కేసులో నలుగురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. వారిలో ప్రణీత్‌రావు, రాధా కిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు విచారించారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఏం జరిగింది, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డబ్బును ఎక్కడెక్కడకు తరలించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అనే విషయాలపై జరిగినదంతా పూస గుచ్చినట్టు దర్యాప్తు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం వీళ్లంతా రిమాండ్ ఉన్నారు.
నిందితుల నుంచి కీలక సమాచారం తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికా వెళ్లారు. వారిద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసుకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే వీరిద్దరినీ విచారించాలి. అందుకే వీరిపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.. ఫోన్ టాపింగ్ కేసుపై కేసీఆర్ రియాక్షన్
ఇందుకోసం న్యాయస్థానం అనుమతులు తీసుకున్నారు పోలీసులు. తాను జూన్ చివరి నాటికి హైదరాబాద్‌కు వస్తానని ప్రభాకర్‌రావు చెబుతున్నారు. ఈలోగా వీరిద్దరు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్తే ఆచూకీ తెలుసుకోవడం కష్టమవుతుందని భావిస్తున్నారు పోలీసులు. అందుకే ఎక్కడున్నా మే నెల చివరినాటికి హైదరాబాద్‌కు రప్పించేలా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించాలని భావిస్తున్నారు పోలీసులు.
అధికారులు మాత్రం దర్యాప్తును కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని క్షుణ్నంగా క్రోడీకరించే పనిలోపడ్డారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరి నుంచి సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఈ కేసు పూర్తి అయ్యేనాటికి ఇంకెన్ని పెద్ద తలకాయలు బయటకు వస్తాయో చూడాలి.