Phone tapping: తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారనే అనుమానాన్ని గవర్నర్ తమిళిసై బహిరంగంగా వ్యక్తం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తుషార్ తనకు ఫోన్ చేసిన విషయం టీఆర్ఎస్ వాళ్లకు ఎలా తెలిసిందని.. ట్విటర్ లో రాజ్ భవన్ గురించి ఎలా ట్వీట్ చేశారని ప్రశ్నించారు. గవర్నర్ అనుమానంతో ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. నిజంగానే తమిళిసై ఫోన్ ను తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేసిందా? గవర్నరే కాకుండా సొంతపార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయా?
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ దేశవ్యాప్తంగా ఉంది. తన ఫోన్ కాల్స్ రహస్యంగా వింటున్నారంటూ.. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కేంద్ర సర్కారును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కేంద్రం దగ్గర ఇజ్రాయిల్ నుంచి కొన్న పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉందని.. ప్రతిపక్ష నేతల ఫోన్లను టాప్ చేస్తున్నారనే ఆరోపణ మొదటి నుంచీ ఉంది. పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ పై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. దేశంలోని విపక్షాలు కేంద్రంపై విమర్శలు చేస్తుంటే.. సేమ్ టు సేమ్ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అదే తరహా ఆరోపణలు చేయడం ఆసక్తికరం. అంటే, దొందుదొందేనా?
ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరిత్యా అత్యంత సీరియస్ కేసు. ఆ మేరకు కఠిన నిబంధనలు ఉన్నాయి. అందుకే, అంతా అనధికారికంగానే సాగుతుందని అంటున్నారు. గతంలో చంద్రబాబు తన ఫోన్ ట్యాప్ చేశారంటూ కేసీఆర్ సర్కారుపై కోర్టుకు కూడా వెళ్లారు. ఆ అంశం అప్పట్లో తీవ్ర సంచలనం. సీఎం కేసీఆర్ ఇరుక్కుపోయేలా ఆ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత చాలాకాలానికి ఇప్పుడు గవర్నర్ తమిళిసై ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ మళ్లీ కలకలం రేపుతోంది. మధ్యలో దాదాపు అన్నిపార్టీల నేతలు అలాంటి అనుమానాలే వ్యక్తం చేయడం మరింత ఆసక్తికరం.
ఇటీవల కేటీఆర్ సైతం మీడియాతో చిట్ చాట్ లో ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడారు. దేశంలో దాదాపు 10వేల మందికిపైగా ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉందన్నారు. తన ఫోన్ కాల్స్ కూడా మోదీ వింటున్నారని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ను కూడా ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారని అన్నారు.
కేటీఆరే కాదు కిషన్ రెడ్డి సైతం ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. బీజేపీ లీడర్ల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని అన్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తెలంగాణలో లక్షల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇలా ఎవరికి వాళ్లు అంతా తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెబుతుండగా.. ఏకంగా రాష్ట్ర అత్యున్నత హోదాలో ఉన్న గవర్నర్ సైతం ఫోన్ ట్యాపింగ్ అనుమానం వ్యక్తం చేయడం మామూలు విషయం కానేకాదంటున్నారు. ఈ పరిణామం ఎటు తిరిగి ఎటు దారి తీస్తుందో.