Srushti Fertility: సరోగసి ముసుగులో పిల్లల అక్రమ విక్రయానికి పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రత ఆస్తుల అటాచ్ కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లిలోని న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వు చేసింది. డాక్టర్ నమ్రత బాధితుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని, ఆ డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశారని సిట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి వాదనలు వినిపించారు.
బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వారికి తిరిగి ఇవ్వాలని కోరారు. పబ్లిక్ ప్రాసికూటర్ 107 బీఎన్‌ఎస్ఎస్ కింద దాఖలు చేసిన పిటిషన్ లోని నిందితుల ఆస్తుల వివరాలపై నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషీయల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆరా తీసింది. ఈడీ దాఖలు చేసిన కేసులో ఇటీవల జైలు నుంచి బెయిల్ పై విడుదలైన నిందితురాలు డాక్టర్ నమ్రత తరఫున ఆమె న్యాయవాది కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును సోమవారానికి రిజర్వు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ అక్రమాలపై కేసులు నమోదు చేసిన ఈడీ డాక్టర్ నమ్రతకు సంబంధించిన 50 స్థిరాస్తులను మార్చ్ నెలలో తాత్కాలికంగా అటాచ్ చేసింది. వీటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం 29.76 కోట్లు. అయితే, మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ దాదాపు 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అటాచ్ చేసిన వాటిలో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుల పేర్లపై ఉన్న భూములు, ఫ్లాట్లు, ఆస్పత్రి ఉన్నాయి.
Also read: క్రిస్మస్‌కు ముందే హీట్ పెంచిన సాయి మంజ్రేకర్.. గ్రీన్ డ్రెస్‌లో అదిరిపోయే అందాలు!