Telangana Delimitation: డీలిమిటేషన్‌తో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ఒక వ్యక్తి-ఒక ఓటు-ఒక విలువ సూత్రం ఆధారంగా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఉండేందుకు, ప్రస్తుత సీట్ల సంఖ్యను దామాషా ప్రకారం 50 శాతం పెంచే ఆలోచనతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. దీనివల్ల తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 170కి పైగా, పార్లమెంట్ సీట్లు 17 నుంచి 25 వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి రాంచందర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ సంస్కరణలను సమర్థిస్తూ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా సీట్ల పెంపు అనివార్యమని, 1971లో దేశ జనాభా 56 కోట్లు ఉన్నప్పుడు 543 పార్లమెంట్ సీట్లు ఉండేవని వివరించారు. నేడు జనాభా మూడు రెట్లు పెరిగిందని, 140-145 కోట్లకు చేరిందన్నారు. 2021లో జనగణన జరగనందున 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెంచడం ఎంతో అవసరమని రాంచందర్ రావు పేర్కొన్నారు.
దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం భారీగా పెరుగుతుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం నియోజకవర్గాల మధ్య ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని ఆయన వివరించారు. ఉదాహరణకు మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలో 40 లక్షల ఓట్లు ఉంటే, సికింద్రాబాద్‌లో 11 లక్షల ఓట్లు ఉన్నాయన్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలైన శేరిలింగంపల్లిలో 7.5 లక్షల ఓట్లు ఉంటే, అంబర్‌పేటలో 2.5 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. ఈ అసమానతలను సరిచేసి, అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యను సమానంగా విభజించేందుకే డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్నట్లు రాంచందర్ రావు తెలిపారు.
గతంలో రాజీవ్ గాంధీ మహిళా రిజర్వేషన్ల పేరుతో హడావుడి చేశారే తప్ప అమలు చేయలేదని విమర్శించారు. యూపీఏ హయాంలో వారి మిత్రపక్షాలే బిల్లును అడ్డుకున్నాయని గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ బయటకు మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్లు నటిస్తూనే, లోపల డీలిమిటేషన్‌ను, రిజర్వేషన్ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తోందని ఫైరయ్యారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గార్లు అర్థం లేని మాటలతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మహిళలకు రాజకీయ న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.
Also Read: SIP, STP లేదా SWP… మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఏది ఉత్తమ మార్గం?