Charminar Fire Accident: హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
అగ్నిప్రమాదం పై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గుల్జార్‌హౌస్ దగ్గర ఉండే కృష్ణ పెరల్స్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోని వారికి ఊపిరాడడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 30 మంది వరకు ఉన్నట్టు చెప్తున్నారు. అందరూ నిద్రమత్తులో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది.
ఏసీ కంప్రెసర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. భవనం ఇరుకుగా ఉండడం, మంటలు ఎగిసి పడడం, పొగ దట్టంగా అలముకోవడంతో.. ఇంట్లోని వారు బయటపడేందుకు వీల్లేకుండా పోయింది. అగ్ని మాపక బృందాలు రంగంలోకి దిగి.. తొలుత చార్మినార్ మార్గంలో రాకపోకలు నిలిపేసి, మంటలార్పే ప్రయత్నం చేశాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. ఆ ముగ్గురూ నిద్రలోనే కన్నుమూసినట్టు భావిస్తున్నారు. దట్టమైన పొగతో ఊపిరాడక, ఉక్కిరిబికిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్టు చెప్తున్నారు. భయాందోళనకు గురైన మిగతావాళ్లు.. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బయటకు వచ్చేందుకు ఇరుకు మెట్ల మార్గం మినహా మరో దారి లేకుండా పోయింది. ఈ క్రమంలో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. 10 ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద తీవ్రతను అంచనా వేసి, 10 అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి రప్పించారు. రెస్క్యూ చేసినవారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు.
ఇరుకు మార్గం కావడంతో ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇంతలో కొందరు స్థానికులు మరో భవంతిపైనుంచి ప్రమాదం జరిగిన బిల్డింగ్ గోడ పగలకొట్టి లోపలకు ప్రవేశించే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో లోపలకు వెళ్లారు. అప్పటికే కొంత ప్రాణనష్టం జరిగిపోయింది. కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, పేలిన ఏసీ, స్పాట్‌లో 17 మంది మృతి
గుల్జార్‌హౌస్ వద్ద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని తెలిపారు. చిన్న ప్రమాదమే అయినా.. ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రభుత్వం సరైన పరికరాలు, శిక్షణ అందించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.