Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో మరో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశముందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది?
హైదరాబాద్ మీర్ చౌక్ ప్రాంతంలో ఆదివారం ఉదయం గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.
ఆదివారం ఉదయం ఆరేడు గంటల మధ్య చార్మినార్ సమీపంలని గుల్జార్ హౌస్ దగ్గర కృష్ణ పెరల్స్ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపు భవనం అంతటా మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలో ఉన్నవారికి ఊపిరాడడం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 30 మంది వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఘటన సమయంలో వారంతా నిద్ర మత్తులో ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది.
ALSO READ: రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. మూడు రోజులు జర జాగ్రత్త
ఏసీ వల్లే ప్రమాదం?
ఆ భవనంలోని నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఒక్కసారిగా ఏసీ కంప్రెసర్ పేలడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్టు అందులోని వారు చెబుతున్నారు. భవనం ఇరుకుగా ఉండడం ఒకటైతే.. మంటలు ఎగిసిపడ్డాయి. దీనికితోడు పొగ దట్టంగా అలముకోవడంతో ఇంట్లోని వారు బయటపడేందుకు వీల్లేకుండా పోయింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. తొలుత చార్మినార్ మార్గంలో రాకపోకలు నిలిపివేసి మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన భవనంలో స్పాట్‌లో ముగ్గురు చనిపోయారు. నిద్రలో వారు కన్నుమూసినట్టు భావిస్తున్నారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఉక్కిరిబికిక్కిరై ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.
తీవ్ర భయాందోళనకు గురైన వాళ్లు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరికి గాయాలు అయ్యాయి. ఈలోగా పది ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. రెస్క్యూ చేసిన కాపాడినవారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు.
ఇరుకుమార్గం కావడంతో మంటలార్పేందుకు ఫైర్ సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. కొందరు స్థానికులు మరో భవనంపై నుంచి ఘటన జరిగిన బిల్డింగ్ గోడ పగలకొట్టి లోపలకు ప్రవేశించారు. అగ్నిమాపక సిబ్బంది నిచ్చెన సాయంతో మరికొందరు లోపలకు వెళ్లారు. అప్పటికే జరగాల్సిన ప్రాణనష్టం జరిగిపోయింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చనిపోయినవారిలో అభిషేక్ మోడీ(30), అరుషి జైన్(17), హర్షాలి గుప్త(7), షీతప్ జైన్ (37), రాజేంద్ర కుమార్(67), సుమిత్ర(65), మున్ని భాయ్(72), ఇరాజ్ (2) ఉన్నారు.
మరోవైపు గుల్జరీహౌజ్ అగ్నిప్రమాద ఘటనపై ఆరా తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.