Ponnam Prabhakar: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, బీజేపీ వైఖరిని, తెలంగాణ పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని గట్టిగా ఎండగట్టారు.
అమరవీరులకు క్షమాపణ చెప్పాల్సిందే!
తెలంగాణ సమాజాన్ని, అమరవీరులను గతంలో ప్రధాని మోడీ, అమిత్ షాలు తీవ్రంగా అవమానించారని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. తెలంగాణ అమరులకు క్షమాపణ చెప్పకుండా రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు అమిత్ షాకు లేదన్నారు. బీజేపీ తన ఉనికిని కాపాడుకోవడానికే ఈ రకమైన మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహిస్తోందని విమర్శించారు. ఒకవైపు హైదరాబాద్, ఢిల్లీలలో దీపావళి పండుగ వాతావరణం ఉంటే, కిలోమీటర్ నడిచి ఏదో సాధించినట్లు బిల్డప్‌లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా అమిత్ షాకు ధైర్యముంటే హింసాత్మక ఘటనలతో రగిలిపోతున్న మణిపూర్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించాలని సవాల్ విసిరారు.
బీజేపీ బీసీ నాయకులకు సవాల్
జనగణనలో కులగణనను ఎందుకు చేర్చలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేస్తోన్న పోరాటానికి భయపడే ఈ పరిణామాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్, బండి సంజయ్, కే లక్ష్మణ్ తదితర నాయకులు కులగణనపై అమిత్ షాను ఒప్పించాలని సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ పతనం ఖాయమైందని, అన్ని రంగాలు, వ్యాపార వర్గాలు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
న్యాయ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వ విజయం
ప్రభుత్వం చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం వల్ల వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగామని పొన్నం సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను కాపాడినందుకు న్యాయ వ్యవస్థకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Also Read: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!