RGV Comments: నేను జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే.. చాలా సంతోషిస్తానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇటీవల దర్శకుడు ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే ఆర్జీవీ ఇంటి వద్దకు పోలీసులు రాగా.. అరెస్ట్ తప్పదంటూ వార్తలు కూడా హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఆర్జీవీతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో తనపై నమోదైన కేసుల గురించి ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఈ సంధర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.. తాను గతంలో ట్వీట్ చేసిన పోస్టులు కొంతవరకు తనకు గుర్తుకు లేవన్నారు. అయితే ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గురించి ఎన్నో మీమ్స్ వచ్చాయని, వారందరినీ అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. తనపై నమోదైన కేసుల గురించి తనకు భయం లేదని, అయితే ఒక చిన్న కేసు గురించి ఇంత రాద్దాంతం చేయడం ఏమిటన్నది తనకు అర్థం కావడం లేదన్నారు. పోలీసులపై ఒత్తిడి ఉందని తాను భావిస్తున్నట్లు, తాజాగా జరిగే పరిస్థితుల గురించి కూడా తాను నేర్చుకుంటానన్నారు.
పోలీసులు తనకు నోటీసులు ఇచ్చే సమయంలో కానీ, ఆ తర్వాత తన ఇంటి వద్దకు వచ్చిన సమయంలో కానీ తనతో మర్యాదపూర్వకంగానే మెలిగినట్లు, తనకు ఇచ్చిన ప్రతి నోటీస్ కి తాను రిప్లై ఇచ్చానన్నారు. పోలీసులు హైదరాబాద్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేశారని, మీడియా కూడా అదే రీతిలో ఎంజాయ్ చేసిందన్నారు. అదే పోలీసులు ఇక కుదరదు అరెస్ట్ చేయాలని భావిస్తే, అందుకు తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆర్జీవీ తెలిపారు. జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే తాను అక్కడ కూడా కథలు వెతుకుతానన్నారు. జైలుకు మంచిగా 2, 3 స్టోరీలు తనకు దొరుకుతాయని అందుకు జైలుకు రెడీ అన్నట్లుగా ఆయన కామెంట్స్ చేశారు.
తాను తీసిన సినిమాలపై బిగ్ టీవీతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తాను తీసిన సినిమాలకు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని, తాను అనుకున్న అభిప్రాయంతో మాత్రమే సినిమా తీశానన్నారు. ఆ సమయంలో కేవలం జగన్ ను దృష్టిలో ఉంచుకొని సినిమా తీశానని, ఇతరులను కించపరచాలని కాదన్నారు. తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చినా, సినీరంగానికి చెందిన వారు స్పందించకపోవడంపై మాట్లాడుతూ.. అసలు ఎందుకు సపోర్ట్ చేయాలని, తానెప్పుడూ అలా చేయలేదన్నారు.
తాజాగా సోషల్ మీడియాలో పోస్టులపై నమోదైన కేసులతో తాను ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. దీనిని బట్టి ఇటువంటి కేసులు కూడా నమోదు చేయవచ్చా అనే ప్రశ్నకు తనకు సమాధానం దొరికిందన్నారు. మూడు రోజులు ఫోన్ కు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు తెలుపుతూ.. తనకు పరామర్శలు ఎక్కువయ్యాయని, అలాగే షూటింగ్ పనిలో ఉన్నట్లు మరోమారు బిగ్ టీవీ ద్వారా పునరుద్ఘాటించారు. జగన్ అంటే తనకు ఇప్పటికీ అమితమైన అభిమానంగా పేర్కొన్న ఆర్జీవీ, తన అభిప్రాయం ఎప్పటికీ మారదన్నారు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రాజమండ్రి జైలుకు వెళ్లి ఫోటో దిగడంపై ఆర్జీవీ స్పందిస్తూ.. ఇప్పటి సీఎం చంద్రబాబు జైలులో ఉండగా, తాను జైలు బయట టూరిస్ట్ లా ఫోటో దిగినట్లు తెలిపారు. అంతేకాదు వ్యూహం సినిమా సమయంలో ప్రమోషన్స్ కోసం తాను ఇలా ప్రయత్నించినట్లు తెలిపారు. ఆ సమయంలో గాంధీ, హిట్లర్, జగన్ జైలులో ఉన్నా కూడా తాను అదే పని చేసేవాడినన్నారు. తానెప్పుడూ కానీ లోకేష్ ని పప్పుగాడు అనే పదంతో ఎప్పుడూ విమర్శించలేదని పిలువలేదని, కావాలంటే తన సినిమాలో పప్పు అనే పదం వాడి ఉండవచ్చని తెలిపారు.
తన అరెస్ట్ గురించి చంద్రబాబు, పవన్ , లోకేష్ వారి పనులు మానుకొని తన అరెస్ట్ గురించి ఆలోచిస్తున్నట్లు తాను భావించడం లేదని, కానీ ఎవరో ఒకరి హస్తం ఉందని భావిస్తున్నానన్నారు. జగన్ ఇటీవల తనపై నమోదైన కేసుల గురించి చెప్పిన మాటలు వాస్తవమని, తాను తీసిన సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతులు ఉన్నాయన్నారు. మొత్తం మీద ఆర్జీవీ వర్సెస్ పోలీస్ మధ్య నోటీస్ వార్ సాగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ తనదైన శైలిలో మాట్లాడి, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.