Nandakumar : ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు.
ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్ ఏ-2గా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే దక్కన్ కిచెన్‌లో వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్‌నగర్‌లోని ఓ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా లీజ్‌కు ఇచ్చి డబ్బులు తీసుకున్నారని నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై నందకుమార్‌పై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఆయన ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నందున పీటీ వారెంట్‌కు అనుమతివ్వాలని బంజారాహిల్స్ పోలీసులు కోర్టును కోరారు. రెండు వేర్వేరు కేసుల్లో నందకుమార్ నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని వారెంట్‌లో ప్రస్తావించారు. ఒక ఫిర్యాదుదారు నుంచి దాదాపు రూ.70లక్షలు, మరొకరి నుంచి రూ. 2 లక్షల వరకు తీసుకుని మోసం చేశారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. కేసు దర్యాప్తు కోసం పీటీ వారెంట్ జారీ చేయాలని పోలీసులు కోరారు. పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతిస్తే రిమాండ్‌లో ఉన్న నందకుమార్‌ను అరెస్టు చేస్తారు.