Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రైతులు,యువకులు,విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల యజమానుల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. మెదక్ జిల్లా పెద్దాపూర్ కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను రాహుల్ తప్పుపట్టారు. రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు.ప్రభుత్వ సంస్థలను మోదీ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తున్నారని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో కేంద్ర పెద్దలు ఆలోచించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100, పెట్రోల్ ధర రూ.110కి చేరినా మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా రాహుల్ గాందీ విమర్శలు గుప్పించారు .సీఎం కేసీఆర్ భూములు లాక్కుంటూ రైతుల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన రైతు వ్యతిరేక చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతులు,కూలీలు, యువకులు తమ సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి యువకుడు నిరుద్యోగం గురించి చెప్తున్నాడని వివరించారు. విద్వేషం, హింస, నిరుద్యోగానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, ఆప్యాయత వల్ల పాదయాత్రలో అలసట రావడం లేదన్నారు.