Rahul Gandhi: ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటారని.. మోదీ చెప్పినట్టే కేసీఆర్ నడుచుకుంటారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసే పని చేస్తున్నాయని.. ఎన్నికలకు ముందు మాత్రం గొడవ పడ్డట్టు డ్రామా చేస్తాయని విమర్శించారు. పార్లమెంటులో కేంద్రం ఏ బిల్లు తీసుకొచ్చినా దానికి టీఆర్ఎస్ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు రాహుల్.
దేశానికే హైదరాబాద్ ఐటీ సెంటర్ గా ఉందని కొనియాడారు. ఈ నగరం మరింత ఎదగాలంటే.. హింస, విధ్వేషాలతో సాధ్యం కాదని.. హైదరాబాద్ డీఎన్ఏలోనే మత సామరస్యం ఉందంటూ ప్రశంసించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా తాను హైదరాబాద్ లో నడుస్తుంటే.. రోడ్లపై అన్నీ గుంతలే ఉన్నాయని.. కేసీఆర్ సర్కారు ఏం అభివృద్ధి చేసిందంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఢిల్లీ కాదు, హైదరాబాదే దేశంలోకెల్లా నెంబర్ 1 పొల్యూటెడ్ సిటీ అన్నారు. సీఎం కేసీఆర్ ఉదయం లేవగానే ధరణి పోర్టల్ చెక్ చేసుకొని.. ఎక్కడి భూములు కొట్టేయాలనే పనిలోనే ఉంటారని విమర్శించారు.
బీజేపీ సోదరుల మధ్య చిచ్చు పెడుతోందని.. ఇలాంటి చర్యలతో దేశం బలహీనమయి.. అభివృద్ధి కుంటుబడుతుందన్నారు. ఎలాంటి విధ్వేశాలు లేకుండా.. జాతి, మత, భాషా భేదాలు లేకుండా.. తన భారత్ జోడో యాత్రలో నదీ ప్రవాహంలా అంతా కలిసి నడుస్తున్నామని అన్నారు. ఇదే మన దేశ సహజ స్వభావమని చెప్పారు.
భారత్ జోడో యాత్రలో తాను రైతులు, వ్యాపారులు, యువత.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతున్నానని.. వారి కష్టాలు వింటున్నానని చెప్పారు. ఉద్యోగాలు లేక ఇంజనీరింగ్ చదివిన వాళ్లు సైతం డెలివరీ బాయ్స్ గా చేస్తుండటం బాధాకరం అన్నారు. మోదీ, కేసీఆర్ లు ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, ప్రాజెక్టులు, కంపెనీలు అన్నీ మోదీ తన ఇద్దరు అనుచరులకే కట్టబెడుతున్నారని.. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నారని కేంద్రాన్ని విమర్శించారు రాహుల్. నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర జరిగిన కార్నర్ మీటింగ్ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం మరింత పెరిగింది.