Weather News: రెండు తెలుగు రాష్ట్రాలో ఎండలు దంచికొడుతున్నాయి. పొద్దుపొద్దున నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. భారీ ఎండల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వస్తే భారీ ఉష్ణోగ్రతలు.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయంటే ఎండలు ఏ రేంజ్ లో కొడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మూములుగా మే నెలలో ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఈ మాసంలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఏప్రిల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజుల నుంచి చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో దంచి కొట్టాల్సిన ఎండలు.. ఇప్పుడే చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పాలమూరు, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇదే క్రమంలో వడగాలుల తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో పిడుగుల ప్రమాదం ఉండే అవకాశం కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అకాల వర్షాల పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలు ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ్టి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేస్తోంది. అలాగే 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. కాగా.. ఈ జల్లుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. అయితే అకాల వర్షాల ప్రజలు జాగ్రత్త ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ALSO READ: Hyderabad ORR toll charges: ఓఆర్ఆర్‌పై టోల్ ఛార్జీలు పెంపు.. KMకు ఎంతంటే..? రేపటి నుంచే అమల్లోకి..