Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బయటకి రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు బయటకు వస్తున్నాయి. భారీ ఎండలు కొడుతున్న వేళ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
21 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
తెలంగాణలో 21 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తూ పలు సూచనలు ఇచ్చింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వివరించారు. ఈ జిల్లాల ప్రజలు, రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో రాళ్ల వర్షం..
అదే విధంగా సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాలలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ జిల్లాలో రాళ్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వాతావరణం విభన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటి వేళ ఎండలు దంచి కొడుతుండగా.. సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వాతావరణం పూర్తిగా ఛేంజ్ అవుతోంది. అక్కడక్కడా వడగళ్ల వానలు పడడంతో పాటూ పిడుగులు కూడా పడుతున్నాయి.
ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్..
అటు ఏపీలో గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా నమోదు అవుతున్నాయి. అయితే ఏపీలో పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈక్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పిడుగులు పడే ఛాన్స్..
అలాగే రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇక అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కొనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.