Telangana Rains: అకాల వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేసేస్తున్నాయి. కురిసేది కాసేపే అయినా దంచికొడుతున్నాయి. తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. రైతులు అవస్థలు అంతా ఇంతా కాదు. రోజువారీ పనులకు అంతరాయం ఏర్పడుతోంది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
అయితే గత రెండు రోజుల నుంచి తేలిక పాటి వర్షాలు పడుతున్నప్పటికీ.. వచ్చే మూడు రోజులు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో తెల్లవారుజామున ఈదురు గాలులకు.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రి రేకులు ఎగిరిపడ్డాయి. ఆస్పత్రిలో పడకలన్నీ చెల్లాచెదురయ్యాయి. అయితే ఆస్పత్రిలో రోగులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాంట్రాక్టర్ సకాలంలో పనులు పూర్తి చెయ్యకపోవడం వల్లే….ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో గత రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దామరంచలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చెట్టు విరిగి పడటంతో పౌల్ట్రీ ఫాం పూర్తిగా ధ్వంసం అయింది . సుమారు 2వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారు. గాలివానకు పలు గ్రామాలలో వృక్షాలు –నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు చోట్ల వర్ష బీభత్సం కొనసాగింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా రేగోడ్‌లో 4.2 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా నంగునూరులో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అటు కళ్లాల్లో, ఇటు మార్కెట్ యార్డుల్లో ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. రైతులు కన్నీరు పెడుతున్నారు.
జగిత్యాలను గాలివాన కమ్మేసింది. అర్ధరాత్రి కురిసిన వడగండ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు.
మెదక్ జిల్లా రేగొడ్ టేక్మాల్ తో సహా పలు మండలాల్లో ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులు కష్టాలపాలవుతున్నారు. అకాల వర్షాలతో మార్కెట్ యార్డులో, కొనుగోలు కేంద్రాల్లో, పొలాల్లోని కల్లల్లో ఉన్న ధాన్యం తడిసి రైతులు కంట కన్నీరు మిగిలిందని ఆందోళనకు గురవుతున్నారు. ఇకనైనా పాలకులు,అధికారులు పట్టించుకోని రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పంటపొలాల్లోని కళ్లల్లో వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. తడిసిన ధాన్యాన్ని చూసి అన్నదాత ఆవేదనతో కన్నీరుమున్నీరయ్యారు.