Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ రోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రెండు రోజులు కూడా గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
Also Read: SBI Recruitment: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. జీతం రూ.48,480
అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాయంత్రం వేళ రైతులు, ప్రజలు పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు పడే సమయంలో జనాలు జాగ్రత్తగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతున్న సమయంలో రైతులు, ప్రజలు చెట్ల కింద ఉండొద్దని.. పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
Also Read: IOB Recruitment: డిగ్రీ అర్హతతో ఐఓబీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.85,920 జీతం