Turmeric Powder: పసుపు భారతీయ వంటకాల్లో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది శతాబ్దాలుగా వంటకాల్లోనే కాకుండా ఆయుర్వేద ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. దీనిలోని కర్కుమిన్ అనే సమ్మేళనం యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలను కలిగి ఉంటుంది. ఈరోజుల్లో మార్కెట్లో వివిధ రకాల పసుపులు లభిస్తాయి, కానీ అన్నీ స్వచ్చమైనవి కాకపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకోవడం ముఖ్యం. మన ఆరోగ్యానికి అనువైన పసుపును గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యానికి ఉత్తమమైన పసుపు
ఆరోగ్య దృష్ట్యా, సేంద్రీయ పసుపు అత్యంత ఉత్తమమైన ఎంపిక. దీనిని రసాయన పురుగుమందులు, కల్తీ లేకుండా సహజ పద్ధతుల్లో పండిస్తారు. ఇందులో కర్కుమిన్ శాతం సాధారణం కన్నా 3-5% అధికంగా ఉండడం వల్ల ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రీయ పసుపును ఎంచుకునేటప్పుడు USDA లేదా భారతదేశంలో FSSAI వంటి సంస్థల సర్టిఫికేషన్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని అంటున్నారు.
పసుపులో రకాలు
అలీపూర్ పసుపు: భారతదేశంలోని కేరళలో దీనిని పండిస్తారు. ఈ పసుపులో కర్కుమిన్ శాతం (5-6%) ఎక్కువగా ఉండడంవల్ల ఇది ఔషధాల తయారీకి అనువుగా ఉపయోగపడుతుంది.
ఈరోడ్ పసుపు: తమిళనాడులో లభించే ఈ పసుపు మంచి రంగు, రుచిని కలిగి ఉంటుంది. దీనిలో కర్కుమిన్ శాతం 3-4% వరకు ఉంటుంది.
కస్టమ్ కర్కుమిన్ ఎక్స్ట్రాక్టులు: కొన్ని బ్రాండ్లు 95% కర్కుమిన్ ఉన్న సప్లిమెంట్లను అందించి నిర్దిష్ట వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయి. అయితే, వీటిని వైద్యుడి సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి.
ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు
కల్తీని తనిఖీ చేయండి: కొన్ని పసుపు పొడులలో రంగు కోసం కృత్రిమ రసాయనాలు, మెటానిల్ యెల్లో వంటివి కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. సేంద్రీయ లేదా బ్రాండెడ్ పసుపును ఎంచుకోండి.
స్వచ్ఛత పరీక్ష: ఒక గ్లాసు నీటిలో పసుపు పొడిని కలిపినప్పుడు అది అడుగున స్థిరపడితే స్వచ్ఛమైనదని రంగు నీటిలో కరిగితే కల్తీ పసుపు అని అర్థం.
శోషణను పెంచడం: కర్కుమిన్ శరీరంలో సులభంగా శోషించబడదు. దీనిని నల్ల మిరియాలు లేదా పాలు, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలతో కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
సేంద్రీయ పసుపు కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఇన్ఫ్లెమేషన్ ను, ఒత్తిడిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర వహిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆరోగ్యానికి సేంద్రీయ అల్లీపూర్ లేదా ఈరోడ్ పసుపు అత్యుత్తమ ఎంపికలు. కల్తీ లేని, సర్టిఫైడ్ పసుపును ఎంచుకోవడం వల్ల దాని పూర్తి ఔషధ గుణాలను పొందడమే కాకుండా రోజువారీ ఆహారంలో పసుపును సరైన మోతాదులో చేర్చడం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.