Ramchander Rao: స్వేచ్ఛ, బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకే దిక్కులేదని, అలాంటిది మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ప్రభుత్వం, ఇంత భారీ ప్రాజెక్ట్ ఎలా చేస్తుందని నిలదీశారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో ఆదివారం నిర్వహించిన చర్చా కార్యక్రమానికి రాంచందర్ రావు హాజరై మాట్లాడారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. హైదరాబాద్ పెరుగుదలతో మూసీ పూర్తిగా కలుషితమైందన్నారు.
Also Read: Etela Rajender: పేదల భూములు గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వపై ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్
వికారాబాద్ నుంచి కృష్ణా నది వరకు మూసీ మొత్తం శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గండిపేట నీళ్లు తాగిన రోజుల నుంచి ఇప్పుడు మూసీ నీళ్లు చూస్తే భయపడే పరిస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు. మూసీ వల్ల నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో పంటలు కలుషితమవుతున్నాయని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ప్రాజెక్టులు చేపడుతుంటే ఆ అప్పుల భారం మోసేది చివరకు ప్రజలేనని రాంచందర్ రావు తెలిపారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, అప్పుడెందుకు మూసీ శుద్ధి గురించి మాట్లాడలేదని నిలదీశారు. పెద్ద బిల్డర్ల నిర్మాణాలు వారికి కనిపించవా అని ప్రశ్నించారు. పేదల ఇండ్లు మాత్రమే టార్గెట్ చేసి కూలుస్తారా అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బఫర్ జోన్ పేరుతో పేదలను బయటకు తోసేయొద్దని సూచించారు. ఇల్లు అనేది పేదవాడి కల అని, అవస్థలు పడి ఈఎంఐలతో కట్టుకున్న పేదల ఇండ్లను కూల్చొద్దని కోరారు. పేదల బతుకులను ఆగం చేయొద్దని పేర్కొన్నారు. రీహాబిలిటేషన్ పూర్తి చేసిన తర్వాతే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ కాళేశ్వరంతో మోసం చేస్తే, నేడు కాంగ్రెస్ మూసీ పేరుతో మూసేశ్వరం అంటూ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. మూసీ శుద్ధి అవసరమని, కానీ కాంగ్రెస్ చేపడుతున్న విధానం మాత్రం తప్పన్నారు. అరచేతిలో స్వర్గం చూపించొద్దని, ప్రజల చెవుల్లో పూలు పెట్టొద్దని స్పష్టంచేశారు. పేదల ఇండ్లపై బుల్డోజర్ పెడితే, బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read: Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!
భారతదేశంలో అత్యంత కాలం పాటు ప్రభుత్వాధినేతగా సేవలందించిన నాయకుడిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన ప్రధాని మోడీకి రాంచందర్ రావు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం భారత ప్రధానమంత్రిగా మొత్తం 8,931 రోజుల పాటు ప్రజాసేవలో కొనసాగుతున్న మోడీ ప్రయాణం అంకితభావం, క్రమశిక్షణ, దేశం పట్ల నిస్వార్థ సేవకు ఒక గొప్ప ఉదాహరణగా కొనియాడారు. మోడీ జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితమైందన్నారు. ఆయన పని తీరు, కష్టపడే స్వభావం, దేశంపై ఉన్న బాధ్యతాభావం వల్లే ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ప్రజల కోసం పని చేయాలనే తపనతో ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ముందుకు నడిపించాయని వివరించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే భావనతో ప్రధాని మోడీ సేవలందించారన్నారు. అందువల్లే.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ రంగంలో పురోగతి, సంక్షేమ పథకాల అమలు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశం గణనీయంగా అభివృద్ధి చెందిందన్నారు. 24 సంవత్సరాలకు పైగా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా దేశ సేవలో నిరంతరం పనిచేయడం ఆయన అంకితభావానికి నిదర్శనమని రాంచందర్ రావు కొనియాడారు.