Big Stories

Revanth Reddy: తప్పులు సహజం.. కావాలంటే తప్పుకుంటా.. తగ్గి నెగ్గిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: రేవంత్ రెడ్డి అంటే దూకుడు. రేవంత్ రెడ్డి అంటే ఫైర్ బ్రాండ్. రేవంత్ రెడ్డి అంటే అటాకింగ్. ఎప్పుడూ తగ్గేదేలే అనేట్టు ఉండే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ కుటుంబం ముందు తగ్గారు. తగ్గి..నెగ్గారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్ అనిపించుకున్నారు.

- Advertisement -

పీసీసీ ప్రెసిడెంట్ పదవి వదులుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడతుందనుకుంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది.

- Advertisement -

కాంగ్రెస్ శ్రేణుల అవగాహన కార్యక్రమంలో సీనియర్లపై తన విధేయత ప్రకటించారు టీపీసీసీ చీఫ్. సీనియర్ల సలహాలతో అందరిని కలుపుకొని పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నానని అన్నారు. పార్టీ వ్యవహారాలలో జానారెడ్డి, భట్టి, మధు యాష్కీ, సంపత్ వంటి సీనియర్ల సూచనలను స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. 10 పనులు చేస్తుంటే ఒకటో రెండో తప్పులు దొర్లుతాయని, అందరూ మానవ మాత్రులేనని అన్నారు. పార్టీలో చిన్న గొడవలు కామన్ అని, అందరం సర్దుకుపోవాలని కోరారు.

అంతకుముందు సైతం రేవంత్, భట్టి మధ్య పరోక్షంగా డైలాగ్ వార్ నడిచింది. తాను త్వరలో చేపట్టబోయే పాదయాత్ర గురించి సీనియర్ల నుంచి అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ఇన్ డైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పాదయాత్ర సమయంలో పార్టీ నేతలంతా ఆయన వెనుక నడిచారని.. అప్పట్లో చంద్రబాబు మీడియా మొత్తం సపోర్ట్ చేసినా కూడా వైఎస్సార్ సీఎం కాగలిగారని అన్నారు. ఇప్పుడు కూడా సీనియర్లు తన వెనకాలే ఉండాలనేలా.. తనను వైఎస్సార్ తో పోల్చేలా.. పరోక్ష కామెంట్లు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎల్పీ లీడర్ భట్టి సైతం పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. గతంలో వైఎస్సార్ వెంట మేమంతా ఉన్నామంటూ పలువురు సీనియర్ల పేర్లు ప్రస్తావించారు. కాంగ్రెస్ అంటే ఏ ఒక్కరిదీ కాదని.. అందరిదీ అనే భావన వచ్చేలా భట్టి మాట్లాడారు. రేవంత్, భట్టిల మధ్య డైలాగ్ వార్ నడిచిన కొన్నిగంటల తర్వాత.. మళ్లీ రేవంత్ మాట్లాడుతూ మనం మనం ఒక్కటేనంటూ.. సీనియర్ల సలహాలు తీసుకుంటానంటూ.. చిన్న గొడవలు కామన్ అని, అందరం సర్దుకుపోవాలని కోరుతూ.. తాను తగ్గి నెగ్గారంటున్నారు రేవంత్ వర్గీయులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News