Ganesh Festival: గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్వాహకులకు, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో.. వైభవంగా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
ఉచిత విద్యుత్.. ముందస్తు వివరాలు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలోనే గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం అందిస్తున్నామని సీఎం తెలిపారు. నిర్వాహకులు సంబంధిత అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ ఉచిత విద్యుత్ పొందవచ్చని సూచించారు. అలాగే, మండపాల ఏర్పాటు ప్రదేశాల వివరాలను ముందుగానే స్థానిక కమిషనరేట్లకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా సమాచారం ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్యలు లేకుండా బందోబస్తు నిర్వహించడం పోలీసులకు సులభమవుతుందని తెలిపారు.
నిమజ్జనం కోసం చెరువుల అభివృద్ధి
నగరంలో అభివృద్ది చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ వేడుకలతో పాటు గణేశ్ నిమజ్జనాలు సజావుగా జరిగేలా నిర్మాణ దశలోనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చెరువుల చుట్టూ క్రేన్లు అమర్చడానికి అనువుగా ఉండేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. మండపాలకు వచ్చే ముఖ్య అతిథుల వివరాలను కూడా కమిషనరేట్‌కు తెలియజేస్తే.. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి ఆ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
శాంతిభద్రతలు.. నిరంతర పర్యవేక్షణ
హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయని, అందుకే శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని రేవంత్ రెడ్డి కోరారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మున్సిపల్, పోలీస్ శాఖలు ఉత్సవాలు ముగిసే వరకు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను కూడా నియమిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిర్వాహకులు పూర్తి సహకారం అందించాలని కోరారు.
Also Read:మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!