Ameerpet Accident: హైదరాబాద్‌లోని బిజీ ప్రాంతమైన అమీర్‌పేట్ శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిపై కాసేపటి క్రితం ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ మార్గంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. వేగంగా వెళ్తున్న ఓ ర్యాపిడో బైక్, తెలంగాణ ఆర్టీసీకి చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రమాదవశాత్తు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఊహించని ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
ఢీకొన్న తీవ్రతకు బైక్ వెనుక కూర్చున్న మహిళ కిందపడిపోగా.. ప్రమాదవశాత్తు బస్సు వెనుక చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లాయి. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదాకరం. ఇక బైక్ నడుపుతున్న వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు కావడంతో, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతురాలి వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.