80’s Photos: ఇప్పుడు లాగా 80sలో ప్రతి చేతిలో సెల్‌ఫోన్ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కెమెరా తీసి ఫొటో తీసుకునే రోజులు కావు. ఫొటో దిగాలంటే… ఓ ప్రత్యేకమైన రోజు కావాలి. ఇంట్లో పెళ్లి ఉంటే.. పండుగ ఉంటే… లేదంటే కుటుంబం మొత్తం ఒకేసారి కలిసిన రోజు అయితే… “ఓ ఫొటో దిగుదాం” అనేవారు. అది కూడా ఇంట్లో కాదు… ఫొటో స్టూడియోకి వెళ్లాల్సిందే… ఎక్కడో ఓ చోట ఒకటో, రెండో స్టూడియోలు మాత్రమే ఉండేవి… అందుకే స్టూడియోకి వెళ్లడం కూడా ఓ అనుభూతే… కొత్త బట్టలు వేసుకుని… జుట్టు సర్దుకుని.. అందరూ కలిసి స్టూడియో మెట్లు ఎక్కేవారు. ఆ రోజు ఇంట్లో ఓ చిన్న పండుగ వాతావరణం ఉండేది.
అప్పట్లో ఫొటో అంటే కేవలం ఓ పేపర్ కాదు. అది ఓ జ్ఞాపకాన్ని జీవితాంతం దాచుకునే మార్గం. చాలా వరకు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలే. రంగులు లేకపోయినా..
ఆ ఫొటోలో ఉన్న మనుషుల ప్రేమ మాత్రం స్పష్టంగా కనిపించేది. కెమెరా ముందు నిలబడినప్పుడు. “కదలకండి…” “నవ్వండి…” అంటూ ఫొటోగ్రాఫర్ చెప్పిన రోజులు మర్చిపోలేనివి. ఒక్క క్లిక్… అంతే… మళ్లీ ఆ ఫొటో కోసం ఎదురుచూపులు… రోజులు గడిచాక ఫొటో చేతికి వస్తే… ఇంట్లో అందరూ చుట్టూ చేరి చూసేవారు. ఆల్బమ్‌లో పెట్టి జాగ్రత్తగా దాచుకునేవారు. ఎందుకంటే… ఆ ఫొటోలో ఉన్నది ఓ ముఖం కాదు… ఆ రోజు… ఆ మనుషులు… ఆ సమయం మొత్తం ఉండేది…
Also Read: 80’s హీరోస్.. కొత్తతరం కథానాయకులకు యమ క్రేజ్, మహా నటులను వెనక్కి నెట్టి..
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కెమెరా మన చేతిలోకి వచ్చేసింది. ఒక్క క్షణంలో ఎన్నో ఫొటోలు తీస్తున్నాం. నచ్చకపోతే వెంటనే డిలీట్ చేస్తున్నాం.
వీడియోలు కూడా క్షణాల్లో రికార్డ్ చేస్తున్నాం. కానీ… ఒక్క ఫొటో కోసం కుటుంబం మొత్తం కలిసి వెళ్లిన ఆ ఆనందం… ఫొటో చేతికి వచ్చిన రోజు కలిగిన ఆ మురిపెం… ఆల్బమ్ తెరిచి పాత జ్ఞాపకాలను చూసిన ఆ అనుభూతి… అది మాత్రం 80’s తరానికి మాత్రమే సొంతం.
Also Read: తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!